కోవూరుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

3 Jul, 2022 05:19 IST|Sakshi

ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి 

బిట్రగుంట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): బోగోలు మండలం కోవూరుపల్లి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడింది. దీంతో ఆటోలో ఉన్న 15 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా సర్వాయపాళెంకు చెందిన తాతా రమణమ్మ (55)ను మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా మృతి చెందింది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కావలి మండలం సర్వాయపాళెం పంచాయతీ కోనేటివారిపాళెంకు చెందిన 15 మంది  కూలీలు దగదర్తి మండలం ఉప్పరపాళెంలో మిరప కోతలకు వచ్చారు. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి ఆటోలో వెళుతుండగా చెన్నై నుంచి ఏలూరు వెళుతున్న కారు మితిమీరిన వేగంతో అదుపుతప్పి ముందు వెళుతున్న కూలీల ఆటోను ఢీకొట్టింది.

ప్రమాద తీవ్రతకు ఆటో రెండుసార్లు బోల్తాకొట్టి రోడ్డు మార్జిన్‌లో పడిపోయింది. కూలీలంతా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న బిట్రగుంట ఎస్‌ఐ చినబలరామయ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 వాహనాల్లో కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. వారిలో తాతా రమణమ్మ అనే మహిళ మార్గమధ్యంలో మృతిచెందింది.  

మరిన్ని వార్తలు