పంట అమ్ముకొని తిరిగి వస్తూ.. అంతలోనే ఆనందం ఆవిరైంది

23 Dec, 2021 11:32 IST|Sakshi

సాక్షి,గోవిందరావుపేట(వరంగల్‌): మిర్చి పంట చేతికొచ్చింది. మార్కెట్లో అమ్ముకున్నారు. ఇంట్లో వాళ్లకు కావాల్సిన సామాన్లు కొన్నారు. మరి కొద్దిసేపయితే ఇంటికి చేరుకునే వారు. అంతలోనే రోడ్డు ప్రమాదం ఒక రైతును కబలించింది. మరికొందరిని గాయాల పాలు చేసింది. రైతులు ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్‌ ఎదురుగా నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో రైతు కుంజ శ్రీను(40) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు వరంగల్‌ మార్కెట్‌లో మిర్చి అమ్ముకునేందుకు వెళ్లారు. అక్కడ మిర్చి అమ్మిన అనంతరం 9 మంది రైతులు కలిసి తమకు కావాల్సిన పురుగుమందులు, ఇంటికి కావాల్సిన సామగ్రి కొనుక్కున్నారు. స్వగ్రామానికి టాటామ్యాజిక్‌లో బయల్దేరారు. ఈ క్రమంలో చల్వాయి, గోవిందరావు పేట మద్య రోడ్డు పక్కనే కాంటా పెట్టిన ధాన్యం బస్తాలను హమాలీలు లారీలో లోడ్‌ చేస్తున్నారు.

దీంతో లారీ వెనుక డోర్‌ కిందకి ఉండగా లారీ చీకట్లో సరిగా కనిపింలేదు. టాటా మ్యాజిక్‌ వేగంగా వచ్చి వెనుక భాగంలో ఎడమ వైపు డీకొట్టింది. దీంతో వాహనంలో కుడివైపు కూర్చున్న శ్రీను లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే చనిపోయాడు. లోపల కూర్చున్న వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఎస్సై కరుణాకర్‌రావు, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ క్లియర్‌ చేసి గాయపడిన రైతులను ఆసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

చదవండి: చెల్లెలికి చిత్రహింసలు.. అత్తింటి కుటుంబాన్నే మట్టుబెట్టాలని..

మరిన్ని వార్తలు