ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

12 May, 2022 23:25 IST|Sakshi

కలికిరి: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి కలికిరి క్రాస్‌ రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు.. కలికిరి పట్టణానికి చెందిన మస్తాన్‌వలీ(45) పీలేరు పట్టణంలో పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాడు. బుధవారం రాత్రి పని నిమిత్తం తన బంధువు నూర్‌మహమ్మద్‌(42)తో కలిసి కలికిరి రాజువారిపల్లికి వెళ్లి వస్తుండగా క్రాస్‌ రోడ్డు సమీపంలోని నగిరిపల్లి క్రాస్‌ వద్ద ఎదురుగా వచ్చిన పీలేరు ఆర్టీసీ డిపో బస్సు ఢీకొంది.

ప్రమాదంలో మస్తాన్‌ వలీ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు, నూర్‌మొహమ్మద్‌కు కాలు విరిగింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మస్తాన్‌ వలీ మరణించినట్లు ధ్రువీకరించారు. నూర్‌మహమ్మద్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తీసుకెళ్లారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

కారు ధ్వంసం 
మదనపల్లె టౌన్‌: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వెనుక వస్తున్న కారు మరో ద్విచక్ర వాహనం బస్సును ఢీకొని« ధ్వంసమైన సంఘటన మదనపల్లె రూరల్‌లో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మదపల్లెకు చెందిన రామకృష్ణ రూ.14 లక్షల కారును కొనుగోలు చేసి అమ్మవారి ఆలయంలో పూజ చేయించేందుకు బయలుదేరాడు. రోడ్డుకు కుడివైపున ఆలయానికి వెళ్లేందుకు కారు ఇండికేటర్‌ వేసి మలుపు తిప్పుతుండగా ఆర్టీసీ ఆద్దె బస్సు వేగంగా వచ్చిన కారును వెనుక నుంచి ఢీకొంది.

ఈ ప్రమాదంలో కొత్తకారు వెనుకభాగం పూర్తిగా దెబ్బతినింది. బస్సు కారును ఢీకొట్టి సడన్‌ బ్రేక్‌ వేయడంతో వెనుక వస్తున్న బి.కొత్తకోట చెందిన నవీన్‌ కారు ముందు భాగం ధ్వంసమైంది. ఆ కారు వెనుకనే వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈడిగపల్లెకు చెందిన సంతోష్‌(21) తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. హైవే పట్రోల్‌ సిబ్బంది ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు