ప్రమాదకర మలుపులో రెండు బైకులు ఢీ..

10 May, 2022 23:32 IST|Sakshi

గిరిజన యువకుడి మృతి  

నలుగురికి గాయాలు 

ఇద్దరి పరిస్థితి విషమం

సాక్షి, పాడేరు: మైదాన ప్రాంతాలకు వెళ్లే పాడేరు ప్రధాన రోడ్డులో కందమామిడి జంక్షన్‌ సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద సోమవారం ఉదయం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గిరిజన యువకుడు మృతి చెందగా, మరో నలుగురు యువకులకు గాయాలయ్యాయి. పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీ చింతగున్నలకు చెందిన పాంగి వెంకట్‌(20), మోదాపల్లి పంచాయతీ గుర్రగరువుకు చెందిన మర్రి శేఖర్, మర్రి కామేష్‌ పల్సర్‌ బైక్‌పై మోదాపల్లి వెళ్తున్నారు.

అదే సమయంలో అనకాపల్లికి చెందిన సిరిపురపు రాజు నరేంద్ర, శరగడం కుమార్‌ మరో బైక్‌పై వస్తున్నారు. కందమామిడి జంక్షన్‌ సమీపంలో ప్రమాదకర మలుపు వద్ద వీరు ఎదురెదురుగా రావడంతో బలంగా ఢీకొన్నారు. రెండు బైకుల మీదున్న వారంతా ఎగిరిపడ్డారు. పల్సర్‌ బైక్‌పై మధ్యలో కూర్చున్న పాంగి వెంకట్‌ తలకు తీవ్ర గాయమవడంతో హుటాహుటిన పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడు.

మిగిలిన నలుగురిలో సిరిపురపు రాజు నరేంద్ర, మర్రి శేఖర్‌లకు తీవ్ర గాయాలవడంతో కేజీహెచ్‌కు తరలించామని పాడేరు ఎస్‌ఐ లక్ష్మణ్‌రావు తెలిపారు. ఈ సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే మృతుడు వెంకట్‌ స్వగ్రామం చింతగున్నలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

ట్రాక్టర్‌ ప్రమాదంలో రైతు మృతి 
రోలుగుంట: మండలంలోని కుసుర్లపూడిలో ఆదివారం సాయంత్రం ట్రాక్టర్‌ చక్రం కింద పడి గొర్లె చెల్లయ్యనాయుడు(37) మృతి చెందాడు. దీనిపై మృతుడు అన్నయ్య పెద్దియ్యనాయుడు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై బి.నాగకార్తీక్‌ కేసు నమోదు చేశారు. ఆదివారం ఉదయం చెల్లయ్యనాయుడు తన పొలంలో దుక్కు పనులు చేసేందుకు ట్రాక్టర్‌ తీసుకెళ్లాడు.

సాయంత్రం కురిసిన వర్షానికి పనులు నిలిపివేసి తిరిగి వస్తున్న క్రమంలో కాలు జారి ట్రాక్టర్‌ చక్రం కిందే పడిపోయాడు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించి శవ పంచనామా చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, పదేళ్ల పాప ఉన్నారు. 

మరిన్ని వార్తలు