Kadapa Road Accident Today: ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

1 Aug, 2022 23:23 IST|Sakshi

ఇద్దరు దుర్మరణం, ముగ్గురికి గాయాలు 

చింతకొమ్మదిన్నె/ పెండ్లిమర్రి/గాలివీడు: కడప–రాయచోటి ప్రధాన రహదారిలోని మద్దిమడుగు వద్ద ఆదివారం మధ్యాహ్నం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలోని నూలివీడుకు చెందిన దేరంగుల శ్రీనివాసులు (45) తన ఆటోలో సొంత పనుల నిమిత్తం కడపకు బయలుదేరారు.

రామాపురం సమీపానికి రాగానే షేక్‌ మస్తాన్‌బీ (26)తోపాటు ఆమె భర్త షేక్‌ ఖాదర్‌బాషా, దర్బార్, నసీమ్‌ ఆటో ఎక్కారు. మద్దిమడుగు వద్దకు రాగానే పుంగనూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ దేరంగుల శ్రీనివాసులు (45)తోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న షేక్‌ మస్తాన్‌బీ (35) అక్కడికక్కడే మృతి చెందారు. ఖాదర్‌బాషా, దర్బార్, నషీమ్‌కు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీకేదిన్నె ఎస్‌ఐ భుమా అరుణ్‌రెడ్డి తెలిపారు.

నాటు వైద్యం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా..
పెండ్లిమర్రి మండలం చీమలపెంట గ్రామ పంచాయతీలోని బారెడ్డిపల్లె గ్రామానికి చెందిన షేక్‌ మస్తాన్‌బీ (35)కి అనారోగ్య సమస్య ఉండటంతో భర్త షేక్‌ ఖాదర్‌ బాషాతో కలిసి రామాపురం వెళ్లారు. అక్కడ నాటు వైద్యం చేయించుకుని తిరిగి స్వగ్రామానికి రావడానికి ఆటో ఎక్కారు. మార్గంమధ్యలో జరిగిన ప్రమాదంలో ఆమె మృతి చెందగా, భర్తకు గాయాలు అయ్యాయి. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. మృతురాలు కూలీ పనులు చేసుకొని జీవనం సాగించేంది.

ఎమ్మెల్యే సంతాపం
గాలివీడు మండలం నూలివీడుకు చెందిన ఆటో డ్రైవర్‌ దేరంగుల శ్రీనివాసులు మృతి పట్ల ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీపీ జల్లా సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌ ఉమాపతిరెడ్డి సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని వారు తెలిపారు. మృతుడికి భార్య వెంకటమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

మరిన్ని వార్తలు