డివైడర్‌ను ఢీకొనడంతో ఘటనలో ఇద్దరు మృతి

8 Dec, 2021 08:16 IST|Sakshi

సంఘటన స్థలంలో యువకుడు,  చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి 

అల్లిపురం(విశాఖ దక్షిణ): ఆర్టీసీ కాంప్లెక్స్‌ దరి తెలుగుతల్లి ఫ్లైవోవర్‌పై నెల తిరక్కుండానే మంగళవారం మరో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యువకుడు, ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందారు. టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలివీ.. సంపత్‌ వినాయక గుడి వైపు నుంచి రైల్వేస్టేషన్‌ వైపు ప్రశాంత్‌ (22), రాధిక (17) బైక్‌పై వస్తూ.. డీఆర్‌ఎం కార్యాలయం దాటిన తర్వాత వచ్చే మలుపులో డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రశాంత్‌ తల డివైడర్‌కు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. రాధికను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ప్రశాంత్‌ది విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతం. అతను సీతమ్మధారలోని ఫ్యాషన్‌ వైబ్స్‌ లో సెలూన్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు. రైల్వే న్యూకాలనీలో నివసిస్తున్నాడు. రాధిక మురళీనగర్‌లోని ఎన్‌జీవోస్‌ కాలనీలో కుటుంబంతో నివసిస్తోంది. ఆమె ఆర్టీసీ కాంప్లెక్స్‌ దరి నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సరం చదువుతోందని పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న టూటౌన్‌ సీఐ కె.వెంకటరావు, ఎస్‌ఐలు మన్మధరావు, సల్మాన్‌ బేగ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను మార్చురీకి తరలించి,  కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. వారిద్దరూ బైక్‌పై ఎందుకు కలిసి వస్తున్నారనే విషయం తెలియరాలేదు.  గత నెల 20న ఇదే ప్రాంతంలో నేవల్‌ ఉద్యోగి అనిల్‌కుమార్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు