పెళ్లైన ఎనిమిదేళ్లకు పుట్టావు... అప్పుడే దూరమయ్యావా కొడుకా

1 Jul, 2021 21:07 IST|Sakshi

బెక్‌ను ఢీకొన్న కారు.. కుమారుడి దుర్మరణం 

తండ్రి పరిస్థితి విషమం 

గద్వాల క్రైం/తెలంగాణ: ‘అమ్మా త్వరగా వచ్చేయి. నేను, నాన్న.. నీ కోసం ఎదురు చూస్తుంటాం.. సరే బైక్‌పై జాగ్రత్తగా వెళ్లండి. నేను త్వరగా వచ్చేస్తాను..’అని ఆ తల్లి బదులిచ్చింది. ఆ కొద్దిసేపటికే జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా మారిన సంఘటన ఇది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గద్వాల పట్టణంలోని ఎర్రమట్టివీధిలో కటిక ముని, నవీన్‌కుమార్‌ దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమారుడు అఖిలేష్‌రాజ్‌ (8) ఉన్నాడు. ముని ఎనిమిదేళ్లుగా స్థానిక కేజీబీవీలో తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది.

ఎప్పటిలాగే బుధవారం ఉదయం బైక్‌పై కుమారుడితో కలిసి తల్లిదండ్రులు కేజీబీవీకి వెళ్లారు. ఆమెను అక్కడ దింపి తండ్రి, కొడుకు తిరుగు ప్రయాణమయ్యారు. సంగాల బ్రిడ్జి వద్దకు చేరుకోగానే రాయచూర్‌ నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీకొంది. దీంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కారు డ్రైవర్‌ పరారీ అయ్యాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. నవీన్‌కుమార్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని రూరల్‌ ఏఎస్‌ఐ వెంకట్రాములు పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. 

గుండెలవిసేలా.. 
కాగా, విగతజీవిగా మారిన కుమారుడు, తీవ్ర గాయాలపాలైన భర్తను చూసి గుండెలవిసేలా భార్య ముని రోదించడం.. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ‘వివాహమైన ఎనిమిదేళ్లకు జన్మించావు. అప్పుడే మా నుంచి దూరమయ్యావా..’అని బాలుడి మృతదేహంపై పడి ఆ తల్లి దుఃఖించడంతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఓ పసిప్రాణం గాలిలో కలిపోయిందని బంధువులు కంటతడి పెట్టారు. అనంతరం బాధిత కుటుంబాన్ని డీఈఓ మహమ్మద్‌ సిరాజ్‌ద్దీన్, ఎంఈఓ సురేష్, ఉపాధ్యాయినులు ప్రణీత, శ్రీదేవి పరామర్శించారు.

మరిన్ని వార్తలు