ప్రాణాలు తీసిన వేగం

20 Jul, 2022 03:17 IST|Sakshi

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. అక్కడికక్కడే ముగ్గురు మృతి.. 

మరొకరి పరిస్థితి విషమం.. ఆదిలాబాద్‌ జిల్లాలో ఘటన

ఉట్నూర్‌/ఉట్నూర్‌రురల్‌ (ఖానాపూర్‌): అతివేగం ముగ్గురు యువకుల ప్రాణాలను బలి తీసు కుంది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూ ర్‌ మండలం కుమ్మరితండాలో మంగళవారం చోటుచేసుకున్న ఈ రోడ్డు ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. మండలకేంద్రానికి చెందిన మహ్మద్‌ షహబాజ్‌ (28), గైక్వాడ్‌ రవి (30) పనుల నిమిత్తం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి స్కూటీపై వెళ్లారు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు.

ఇదేక్రమంలో మండలకేంద్రానికి చెందిన రాథోడ్‌ మోను(19), తన స్నేహితుడు అర్క ఆశిష్‌తో కలిసి ఇంట్లో వారికి మందులు తీసుకొచ్చేందుకు ఆదిలాబాద్‌కు బైక్‌పై బయ ల్దేరారు. అదేసమయంలో వర్షం మొదలవడంతో బైక్‌ వేగం పెంచారు. ఈ క్రమంలో కుమ్మరితండా సమీపంలో డీసీఎంను ఓవర్‌టేక్‌ చేయబోతుండగా ఎదురుగా వస్తున్న రవి, షహబాజ్‌ స్కూటీని బలంగా ఢీ కొట్టారు.

ఈ ఘటనలో షహబాజ్, రవి, మోను అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆశిష్‌కు తీవ్ర గాయాలు కాగా ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

పెళ్లైన మూడు నెలలకే మృత్యు ఒడికి...
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గైక్వాడ్‌ రవికి గత ఏప్రిల్‌ 24న వివాహం కాగా మండల కేంద్రంలో పెయింటింగ్‌ దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నాడు. పెళ్లి అయిన మూడు నెలలకే మృత్యుఒడికి చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మహ్మద్‌ షహబాజ్‌ తండ్రి ఇస్మాయిల్‌ ఆర్నెల్ల క్రితం మృతి చెందడంతో మండల కేంద్రంలో సైనొటెక్‌ కంప్యూటర్‌ సెంటర్‌ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

మరిన్ని వార్తలు