ఓఆర్‌ఆర్‌ అంటేనే అమ్మో.. అంటున్నారు

16 Nov, 2020 09:15 IST|Sakshi

574 ప్రమాదాల్లో 273 మృతి, 566 మంది క్షతగాత్రులు 

ఔటర్‌.. డేంజర్‌
జిల్లాలోని పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు అంటేనే జిల్లా ప్రజలు అమ్మో.. అంటున్నారు. తరుచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్నారు. నవంబర్‌ 10వ తేదీన పాటి వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రమాదాలను అరికట్టడంలో విఫలమవుతున్నారు. స్పీడ్‌ గన్స్‌ ఏర్పాటు చేసినా అవి వేగ నియంత్రణకు ఫలితాలివ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే జిల్లాలోని జాతీయ రహదారులు గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.  ఈ ఏడాది జిల్లాలో జరిగిన 574 ప్రమాదాల్లో 273 మృతి చెందగా 566 మంది క్షతగాత్రులయ్యారు.  

సంగారెడ్డి అర్బన్‌: ఔటర్‌ రింగ్‌రోడ్డుపై లాక్‌డౌన్‌లో మినహా తరుచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగమే కారణమని అధికారులు అంచనావేస్తున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం కావడం, జిల్లా కేంద్రంతో పాటు ముంబాయి, ఆంధ్రాకు ఔటర్‌ రింగురోడ్డు మీదుగా లక్షల్లో వాహనాలు వెళ్తుంటాయి. అతివేగంతో కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతుండగా, ఆగి ఉన్న వాహనాలను ఢీ కొట్టి మృత్యువాత పడ్డ సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుత శీతాకాలంలో పొగమంచు వల్ల తెల్లవారు జామున, రాత్రుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. వేగాన్ని నియత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  

సూచిక బోర్డులూ కరువు.. 
జిల్లాలో జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, పంచాయితీరాజ్‌ రోడ్లపై మూలమలుపులు ఉండటంతో అతివేగంతో వెళ్తున్న వాహనాలు అదుపుతప్పి బోల్తాపడుతున్నాయి. పాదాచారులను, ద్విచక్రవాహనాదారులను ఢీ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అకోలా–నాందేడ్‌ జాతీయరహదారి శివ్వంపేట వద్ద ఉన్న మూల మలుపు వద్ద తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. చౌటకూర్‌ వద్ద, అన్నాసాగర్‌ చెరువు సమీపంలో పసల్‌వాదీ, సంగారెడ్డి సమీపంలో మూలమలుపులతో ప్రమాదం పొంచి ఉంది. ఎంఎన్‌ఆర్‌ చౌరస్తా నుంచి పటన్‌చెరు మండలం గణేష్‌గడ్డ వరకు సూమారు 10 మూలమలుపులు ఉన్నాయి. ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామంలో ఉన్న ప్రమాదకర మూలమలుపులతో పాదాచారులు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. ఆర్‌అండ్‌రోడ్లు, పంచాయితీరోడ్లపై ఉన్న మూల మలుపుల వద్ద సూచికబోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.  

అసంపూర్తిగా 65వ నంబర్‌ జాతీయ రహదారి పనులు.. 
65వ నంబర్‌ జాతీయ రహదారి పనులు అసంపూర్తిగా ఉండటంతో అతివేగంగా వెళ్తున్న వాహనాలు అదుపుతప్పి బోల్తాపడుతున్నాయి. మల్కాపూర్‌ చౌరస్తాలో నిర్మిస్తున్న అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు మూడు ఏళ్లకుపైగా అవుతున్నా పూర్తి కావడం లేదు. మల్లేపల్లి శివారులో ఉన్న బీరు పరిశ్రమల నుంచి ప్రతిరోజు లోడుతో భారీ వాహనాలు వస్తుంటాయి. అసంపూర్తిగా ఉండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పెద్దాపూర్‌లో సర్వీస్‌రోడ్డు అసంపూ ర్తిగా ఉంది. దీంతో ప్రయాణికుల బాధలు వర్ణనాతీతం. 

డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలు నడపాలి 
డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి తమ వాహనాలను జాగ్రత్తగా నడపాలి. అతివేగం పనికిరాదు. కోవిడ్‌–19 కారణంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలను తగ్గించాం. కొందరు  డ్రైవర్లు రోడ్ల వెంబడి వాహనాలను ఇస్టానుసారంగా పార్కింగ్‌ చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. అతివేగంతో డ్రైవింగ్‌ చేసే వాహనాలను కట్టడి చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తూన్నాం. అతివేగం, అజాగ్రత్త, డ్రంక్‌అండ్‌డ్రైవ్‌ చేసి ప్రమాదాలకు కారణం కాకూడదు.  – చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ 

మరిన్ని వార్తలు