దారుణం: 8 మందిని బలిగొన్న నిర్లక్ష్యం

20 Sep, 2021 02:26 IST|Sakshi
గోపాల్‌రెడ్డి, రచన దంపతులు

నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో  రోడ్డు ప్రమాదాలు 

కట్టంగూర్‌/అమ్రాబాద్‌: డ్రైవర్ల నిర్లక్ష్యం.. అతివేగానికి ఎనిమిది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వేగంగా గమ్యస్థానానికి వెళ్లిపోవాలని భావించి వాహనం నడపడంతో ఏకంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు ఎనిమిది మందిని బలిగొన్నాయి. పలువురు తీవ్రగాయాల పాలయ్యారు.. 

65వ జాతీయ రహదారిపై... 
నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ మండలం ముత్యాలమ్మగూడెం, పామనగుండ్ల గ్రామాల మధ్య 65వ నంబర్‌ జాతీయ రహదారిపై గచ్చుగురువు చెరువు వద్ద ఆదివారం అరగంట వ్యవధిలో జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మరణించారు. శాలిగౌరా రం రూరల్‌ సీఐ నాగదుర్గాప్రసాద్, కట్టంగూర్‌ ఎస్‌ఐ శివప్రసాద్‌ తెలిపిన వివరాలు.. ఏపీ ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం హైపరాజుపాలెంకు చెందిన కదిరి గోపాల్‌రెడ్డి (31), కదిరి రచన (30) దంపతులు. వీరి కూతురు రియాన్షుతోపాటు కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన ప్రశాంత్‌ (24) కలిసి హైదరాబాద్‌ నుంచి కారులో నూజివీడుకు బయలుదేరారు.

కట్టంగూర్‌ మండలం ముత్యాల మ్మగూడెం శివారులోకి రాగానే విజయవాడ వైపు వెళ్తున్న ఎస్‌ఆర్‌ఎంటీ పార్శిల్‌ లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో అతివేగంగా వచ్చిన కారు లారీ వెనుకభాగాన్ని ఢీకొట్టింది. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొని ఆగిపోయింది. కారు నడుపుతున్న ప్రశాంత్‌తోపాటు గోపాల్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలైన రచన, రియాన్షును నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలిస్తుండగా రచన మార్గమధ్యలో మృతి చెందింది. రియాన్షు స్వల్ప గాయాలతో బయటపడింది.  


కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీస్తున్న పోలీసులు   

మృతదేహాలు తీస్తుండగా... 
కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు జేసీబీ సాయంతో తీసేందుకు యత్నిస్తుండగా 300 మీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ నుంచి పూజారులు జంగం శివప్రసాద్‌ (23), రోమాల వినయ్‌కుమార్‌ (21) సూర్యాపేటలోని సత్యసాయి సేవా సమితిలో జరిగే రుద్రాభిషేకం కార్యక్రమానికి కారులో బయలుదేరారు. ముత్యాలమ్మగూడెం గ్రామశివారులోకి రాగానే ట్రాఫిక్‌లో ఆగిఉన్న సిమెంట్‌ లారీని వెనుకనుంచి అతివేగంగా ఢీకొట్టారు. వినయ్‌కుమార్, జంగం శివప్రసాద్‌ అక్కడికక్కడే మృతి చెందారు. అరగంట వ్యవధిలో జరిగిన ప్రమాదాల్లో ఐదు ప్రాణాలు గాల్లో కలిశాయి. రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. వినయ్‌ది హైదరాబాద్‌లోని బాలాపూర్‌ మండలం బడంగ్‌ పేట కాగా, శివప్రసాద్‌ది రంగారెడ్డి జిల్లా దోమ మండలం మోత్కూరు. అవివాహితులైన వీరు హయత్‌నగర్‌లోని సత్యసాయిసేవా సమితిలో పూజారులుగా పనిచేస్తున్నారు. మృతదేహాలను  నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదాలకు కారణమని చెప్పిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

విదేశాలకు వెళ్లేందుకు.. 
మృతుడు కదిరి గోపాల్‌రెడ్డి రాజస్తాన్‌లో మైనింగ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. దక్షిణాఫ్రికాలో వేరే ఉద్యోగం రావడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈనెల 18న లగేజీని ట్రాన్స్‌పోర్ట్‌లో పంపి, భార్య రచన, కూతురు రియాన్షుతో కలిసి రాజస్తాన్‌ నుంచి ఆదివారం హైదరాబాద్‌కు వచ్చాడు. స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి కారులో స్వగ్రామం అయిన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం హైపరాజుపాలెం బయలుదేరాడు. స్నేహితుడిని అతని స్వగ్రామమైన నూజివీడులో దించి వెళ్లేందుకు విజయవాడ హైవే మీదుగా బయలుదేరగా కట్టంగూర్‌ మండలం ముత్యాలమ్మగూడెం వద్ద ప్రమాదం జరిగింది. దంపతులతోపాటు ప్రశాంత్‌ మృతి చెందాడు. గోపాల్‌రెడ్డి, రచనలది ప్రేమవివాహం. వీరికి 2014లో వివాహం జరగగా 2017లో కూతురు రియాన్షు జన్మించింది. ప్రశాంత్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.   

పుట్టువెంట్రుకలు  తీయించేందుకు వెళ్లి.. 
ఎప్పుడూ భక్తుల రాకపోకలతో రద్దీగా ఉండే మద్దిమడుగు రహదారి రక్తమోడింది. దైవదర్శనానికి ఆటోలో వెళ్లివస్తున్న భక్తులను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదం నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండలం మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం జటావత్‌తండాకు చెందిన రాజు, చంద్రకళ దంపతులు. కుమారుడు బాలపరమేశ్‌ పుట్టువెంట్రుకలు తీయించేందుకు బంధువులతో కలిసి శనివారం ఆటోలో మద్దిమడుగుకు వెళ్లారు. ఆదివారం ఉదయం స్వగ్రామానికి తిరిగి వస్తుండగా మద్దిమడుగు సమీపంలోని మలుపు వద్ద దేవరకొండ డిపో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలోని జమృ (55), జటావత్‌ పోలి (66), డ్రైవర్‌ శ్రీను (32) అక్కడికక్కడే చనిపోయారు. రాజు, చంద్రకళ, జ్యోతి, శిరీష, బాలపరమేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. జ్యోతి పరిస్థితి విషమంగా ఉంది. అమ్రాబాద్‌ సీఐ ఆదిరెడ్డి, పదర, అమ్రాబాద్‌ ఎస్‌ఐలు సురేష్‌కుమార్, వెంకటయ్య ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అమ్రాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం సంభవించినట్టు మృతుల బంధువులు ఆరోపించారు.  

మరిన్ని వార్తలు