సైబర్‌ నేరస్తుల సెక్స్‌టార్షన్‌

13 Apr, 2022 04:12 IST|Sakshi

వాట్సాప్, ఫేస్‌బుక్, టిండర్‌ వేదికగా దోపిడీ 

చాట్, వీడియోలతో బెదిరిస్తున్న కేటుగాళ్లు 

వీడియో చాట్‌ను కుటుంబీకులు, సన్నిహితులకు షేర్‌ చేస్తామని బ్లాక్‌మెయిల్‌ 

రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఇదే దందా

ప్రభుత్వ విభాగంలో జాయింట్‌ డైరెక్టర్‌ హోదాలో పనిచేస్తున్న ఓ అధికారి కొడుకు బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఓ రోజు రాత్రి 10 గంటలకు ఫేస్‌బుక్‌లోని మెసెంజర్‌ ద్వారా వీడియో కాల్‌ వచ్చింది. ఆన్‌లైన్‌లోనే ఉన్న ఆ విద్యార్థి ఆన్సర్‌ చేశాడు. ఎదురుగా ఓ అమ్మాయి న్యూడ్‌ పొజిషనల్‌లో ఉండి మాట్లాడింది. ఓ 30 సెకన్లు కాల్‌లోనే ఉన్న ఆ అబ్బాయి తర్వాత కట్‌ చేశాడు. అంతలోనే అదే పేరుతో ఉన్న ఐడీ నుంచి అతడికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ రాగా యాక్సెప్ట్‌ చేశాడు.

అంతే.. అమ్మాయితో న్యూడ్‌గా చాట్‌ చేశావని అతడి కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న కుటుంబీకులు, సన్నిహితులకు వీడియో షేర్‌ చేస్తానని బెదిరింపులు మొదలయ్యాయి. సమస్య నుంచి బయటపడేందుకు అవతలి వ్యక్తి అడిగిన రూ.10 వేలను ఫోన్‌ పే ద్వారా ఆ అబ్బాయి బదిలీ చేశాడు. పది వేలతో మొదలైన వ్యవహారం రూ.1.50 లక్షల వరకు వెళ్లింది. అయినా వేధింపులు ఆగలేదు. స్నేహితుడి తండ్రి పోలీస్‌ అధికారి కావడంతో సంప్రదించాడు. సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేసి సమస్య నుంచి బయటపడ్డాడు.  

ఇది కేవలం ఒకరకమైన బెదిరింపు వ్యవహారమే. ఇలాంటి మూడు, నాలుగు రకాల పద్ధతుల్లో బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ యువతతో పాటు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు, ప్రొఫెషనల్‌ ఉద్యోగాల్లో ఉన్న వారి నుంచి సైబర్‌ నేరగాళ్లు భారీగా దండుకుంటున్నారు. ఫేస్‌బుక్, టిండర్, వాట్సాప్‌.. ఇలా మూడు వేదికల ద్వారా ఎదుటి వ్యక్తులను మానసికంగా హింసించి దోపిడీకి పాల్పడుతున్నారు. అశ్లీల వీడియోల లైవ్‌ లింక్‌ను వాట్సాప్, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ల ద్వారా షేర్‌ చేసి అవతలి వ్యక్తికి వీడియో కాల్‌ చేస్తారు. కాల్‌ ఆన్సర్‌ చేయగానే లైవ్‌ లింక్‌లో అశ్లీలత మొదలవుతుంది. దీనికి కొంత మంది యుక్త వయస్కులు ఆక్షరణకు గురై సైబర్‌ నేరస్థుడి చేతికి దొరికిపోతున్నారు. అవతలి వ్యక్తులు వీడియో కాల్‌ను ఆటోమేటిక్‌ రికార్డు చేసి బెదిరిస్తున్నారని సైబర్‌ ఎక్స్‌పర్ట్స్‌ తెలిపారు.  

ఎలా టార్గెట్‌ చేస్తారు? 
ఎవరైనా అమ్మాయి పేరు, నకిలీ ఫొటోతో నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీని సైబర్‌ నేరగాళ్లు రూపొందిస్తారు. లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తికి ఫేస్‌బుక్‌లో ఆ ఐడీ ద్వారా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెడతారు. అవతలి వ్యక్తి యాక్సెప్ట్‌ చేయగానే మెల్లెగా చాట్‌లోకి లాగుతారు. అలా మొదలైన చాట్‌ కాస్తా మొబైల్‌ నంబర్లు ఇచ్చి పుచ్చుకునే వరకూ వెళ్తుంది. ఆ తర్వాత వాట్సాప్‌ చాట్‌లో పర్సనల్‌ ఇన్‌ఫర్మేషన్‌ షేర్‌ చేసుకోవడం.. అడల్డ్‌ కంటెంట్, న్యూడ్‌ చాట్‌ చేసుకునే వరకు తీసుకొస్తారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. చాట్‌ నుంచి వీడియో కాల్స్‌లోకి లాగుతారు.

అవతలి వైపు నుంచి రికార్డు చేసిన ఓ న్యూడ్‌ వీడియోను వాట్సాప్‌ కాల్‌లో లైవ్‌లాగా చిత్రీకరించి ఎదుటి వ్యక్తిని న్యూడ్‌ చాట్‌లోకి తీసుకొస్తారు. ఈ మొత్తం కాల్‌ను రికార్డు చేసి తర్వాత అదే వ్యక్తి వాట్సాప్‌కు వీడియో షేర్‌ చేస్తారు. ఇలా షేర్‌ చేసిన వీడియోతో డబ్బులివ్వకపోతే యూట్యూబ్‌లో పెడతామని బెదిరిస్తారు. యువతులను బెదిరించి న్యూడ్‌ వీడియోలు తీసి అమ్ముకుంటున్నారని ప్రచారం చేస్తామని బ్లాక్‌ మెయిల్‌ చేస్తారు. ఇలాంటి ఎక్స్‌టార్షన్‌ కాల్స్‌ దాదాపు 90 శాతం.. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట మధ్యే జరుగుతున్నాయని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.  
– సాక్షి, హైదరాబాద్‌

దేశంలో ఒక్క ఏడాదే 2.5లక్షల కేసులు
వాట్సాప్, ఫేస్‌బుక్, టిండర్‌ ద్వారా సెక్స్‌ ఎక్స్‌టార్షన్‌ వ్యవహారంలో 2020లో (కరోనా సమయం) దేశవ్యాప్తంగా 2.5 లక్షల కేసులు నమోదయ్యాయని కేంద్ర హోం శాఖ లెక్కల్లో స్పష్టమైంది. రాజస్థాన్, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఇలాంటి నెట్‌వర్క్‌ను సైబర్‌ మాఫియా నడిపిస్తోందని దర్యాప్తు విభాగాల ద్వారా బయటపడింది. ఇలాంటి కేసులకు సంబంధించి 2021లో ఢిల్లీ పోలీసులు 70 మంది గ్యాంగ్‌ను అరెస్టు చేశా రు. రాష్ట్రంలోనూ సైబరాబాద్, హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్లలో ఇలాంటి కేసులు భారీగా నమోదవుతున్నాయి. సెక్స్‌ ఎక్స్‌టార్షన్‌ కు సంబంధించి గతేడాది 650కి పైగా కేసులు నమోదైనట్టు పోలీస్‌ వర్గాలు తెలిపాయి.  

భయపడొద్దు.. 
అశ్లీల వీడియో కాల్స్‌ వస్తే  వెంటనే సంబంధిత అకౌంట్‌ను బ్లాక్‌ చేయడంతో పాటు బాధిత వ్యక్తి వారి ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను తాత్కాలికంగా డీ యాక్టివ్‌ చేసుకుంటే మంచిది. ఆ వీడియో ద్వారా వాట్సాప్‌ కాంటాక్ట్‌ నుంచి ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే సైబర్‌ క్రైమ్‌ అధికారులకు ఫిర్యాదు చేయాలి.  బయపడి సైబర్‌ నేరస్థుడికి డబ్బులు పంపితే వేధింపులు పెరుగుతాయని గుర్తించాలి.        
– ప్రసాద్‌ పాటిబండ్ల,  డైరెక్టర్, సీఆర్‌సీఐడీఎఫ్‌    

మరిన్ని వార్తలు