‘48 గంటల్లో మొగల్రాజపురం దోపిడీ కేసును ఛేదించాం’

17 Sep, 2020 18:33 IST|Sakshi

సాక్షి, విజయవాడ : సంచలనం సృష్టించిన మొగల్రాజపురం దోపీడీ కేసును పోలీసులు ఛేదించారు. 48 గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ శ్రీనివాస్‌ గురువారం మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ తమ ఇంట్లో 48.50 లక్షల రూపాయల నగదు చోరీ జరిగిందని డాక్టర్ మురళీధర్ ఫిర్యాదు ఇచ్చారు. ఈ చోరీలో మొత్తం ఎనిమిది మంది సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారు. కేటరింగ్ పని చేసే నాగేంద్ర, ఆసుపత్రి పీఆర్ఓ మెండెం విజయ్ తాడేపల్లికి చెందిన నేరగాళ్లతో కలిసి దోపిడీ చేయించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశాం. 34.75 లక్షల రూపాయల నగదు, 48 గ్రాముల బంగారం రికవరీ చేశాం. ఏ2 నిందితుడు జోహాన్ వెస్లీకి నేర చరిత్ర ఉంది. డాక్టర్ మురళీధర్ దగ్గర విజయ్‌ అనే వ్యక్తి పీఆర్ఓగా పని చేస్తున్నాడు. దోపిడీకి ముందే డాక్టర్ భార్య స్వరూపరాణికి పీఆర్‌ఓ ఫోన్ చేశాడు. ( తాగుబోతు తల్లి వేధింపులు భరించలేక..)

బయట అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతున్నారని అలర్ట్ చేశాడు. పీఆర్‌ఓ విజయ్‌పై అనుమానంతో విచారిస్తే వాస్తవాలు బయటకు వచ్చాయి. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నాం. దుర్గగుడి సింహాల దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నాం. దాని అధారంగా దర్యాప్తు చేస్తాం. దుర్గగుడి సింహాల దొంగతనం కేసులో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశాం. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం. నగరంలో అన్ని దేవాలయాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. దేవాలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోమని కమిటీ సభ్యులకు చెప్పామ’’న్నారు.

మరిన్ని వార్తలు