కక్షగట్టి ఇల్లు లూటీ!

11 Aug, 2020 07:02 IST|Sakshi
కేసు వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీకుమార్, పక్కన జాయింట్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్, అడిష్నల్‌ డీసీపీ టాస్క్‌ఫోర్స్‌ చక్రవర్తి

పాత యజమాని ఇంట్లో  దొంగతనం చేసిన పనివాళ్లు 

రూ.2.5 కోట్లు పోయాయని బాధితుడి ఫిర్యాదు 

కేసును ఛేదించిన పోలీసులు 

రూ.1.29 కోట్లు రికవరీ మిగతా డబ్బు ఏమైనట్టు? 

హిమాయత్‌నగర్‌: నమ్మకంగా పని చేస్తున్న తమను యజమాని అకారణంగా తిడుతుండటం వారిని బాధించింది.... ఈలోపే యజమాని పనిలోంచి తీసేశాడు...దీంతో యజమానిపై పగ పెంచుకున్నారు. అతడి ఆర్థిక లావాదేవీలపై కన్నేసిన ఆ ఇద్దరూ భారీ చోరీకి పాల్పడ్డారు. ఇటీవల గోల్కొండ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ వ్యాపారి ఇంట్లో రూ. 2.50 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితులు టోలిచౌక్‌కి చెందిన మహ్మద్‌ అఫ్సర్‌(24), మిర్జా అస్వాక్‌ బేగ్‌(22)తోపాటు వారికి సహకరించిన మరో ముగ్గురు రెహమాన్‌ బేగ్‌(23), మహ్మద్‌ అమీర్‌(20), సయ్యద్‌ ఇమ్రాన్‌(23)లను అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సోమవారం ఏఆర్‌ శ్రీనివాస్‌ జాయింట్‌ సీపీ (వెస్ట్‌జోన్‌), అడిష్నల్‌ డీసీపీ టాస్క్‌ఫోర్స్‌ జి.చక్రవర్తిలతో కలిసి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం...  నిందితుల్లో మహ్మద్‌ అఫ్సర్‌ బాల్‌రెడ్డినగర్‌ టోలిచౌక్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అసదుద్దీన్‌ అహ్మద్‌ వద్ద గతంలో కారు డ్రైవర్‌గా పని చేశాడు. మరో నిందితుడు మీర్జా అస్వాక్‌ బేగ్‌ శామీర్‌పేటల్‌ వ్యాపారికి చెందిన ఫామ్‌హౌస్‌లో పని చేశాడు. వ్యాపారి వీరిద్దరినీ అకారణంగా దూషించేవాడు. రెండేళ్ల క్రితం ఇద్దరినీ పనిలోంచి తీసేశాడు. దీన్ని  మనసులో పెట్టుకున్న ఇద్దరూ యజమానిపై కక్ష తీర్చుకొనేందుకు అతడి ఇంట్లో భారీ చోరీ చేయాలని పథకం వేశారు. 

మరో ముగ్గురి సాయంతో.. 
మహ్మద్‌ అఫ్సర్, మిర్జా అస్వాక్‌ బేగ్‌లు తమ పథకం అమలు చేసేందుకు ఇదే ప్రాంతానికి చెందిన రెహమాన్‌ బేగ్, మహ్మద్‌ అమీర్, సయ్యద్‌ ఇమ్రాన్‌ సాయం తీసుకున్నారు. ఇద్దరూ వ్యాపారి ఆర్థిక లావదేవీలను గమనించేవారు. ఈ ఏడాది జూలై 21న వ్యాపారి తనకు సంబంధించిన ఒక ల్యాండ్‌ను అమ్మగా వచ్చిన రూ. 2.5 కోట్లను ఇంట్లోని అల్మారాలో భద్రపరిచాడు. జూలై 22నశామీర్‌పేటలోని ఫాంహౌస్‌లో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న హ్మద్‌ అఫ్సర్, మిర్జా అస్వాక్‌ బేగ్‌లు అదే రోజు రాత్రి 2.30 గంటల సమయంలో బాల్‌రెడ్డినగర్‌లోని యజమాని ఇంట్లో చొరబడ్డారు. రెహమాన్‌ బేగ్, మహ్మద్‌ అమీర్, సయ్యద్‌ ఇమ్రాన్‌లు ఇంటి బయట మనుషుల కదలికలను గమనిస్తూ ..ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమాచారం ఇచ్చేవారు. 

బియ్యం సంచుల్లో నింపుకొని..
ఇంట్లోకి చొరబడి ఉడెన్‌ అల్మారాలో ఉన్న డబ్బును చోరీ చేసి బియ్యం సంచుల్లో నింపుకొని ఉడాయించా రు. ఆ డబ్బును మహ్మద్‌ అమీర్‌ ఇంట్లో దాచి కొద్ది కొద్దిగా పంచుకున్నారు. ఈ డబ్బుతో ఒక అవేంజర్‌ బైక్‌ను కూడా కొన్నారు. మిగతా డబ్బును కూడా ఏం చేయాలి? ఎలా ఖర్చు పెట్టాలో  తెలియని అయోమయపు స్థితిలో వీరున్నట్లు సీపీ వెల్లడించారు.  

కేసు నమోదు...  
బాధిత వ్యాపారి అసదుద్దీన్‌ అహ్మద్‌ జూలై 27న తాను  ల్యాండ్‌ అమ్మి తెచ్చిన రూ.2.5 కోట్లు ఇంట్లో ఉంచగా చోరీకి గురయ్యాయని గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు విచారణ చేపట్టిన క్రైమ్‌ విభాగం పోలీసులు వ్యాపారి వద్ద గతంలో పని చేసి  మానేసిన వారందరినీ పిలిచి విచారించారు.  మహ్మద్‌ అఫ్సర్, మిర్జా అస్వాక్‌ బేగ్‌లను కూడా పిలిచి విచారించగా... తామే చోరీకి పాల్పడినట్టు వెల్లడించారు. తమను పదే పదే తిట్టడమే కాకుండా అకారణంగా పనిలోంచి తీసేయడంతోనే ఈ దొంగతనం చేశామని చెప్పారని కమిషనర్‌ తెలిపారు.  

మిగతా డబ్బు ఏమైనట్లు...? 
యజమాని అసదుద్దీన్‌ మాత్రం తన వద్ద ఉన్న రూ.2.5 కోట్లు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మాత్రం ఈ ఐదుగురి నిందితుల నుంచి రూ.1.29 కోట్లు రికవరీ చేశారు. యజమాని సమక్షంలోనే అల్మారా తెరిచి వీరు చోరీ చేసిన డబ్బును అమర్చగా కరెక్ట్‌గా ఉన్నట్టు నిర్ధారణైంది.  యజమాని ఫిర్యాదులో పేర్కొన్న మొత్తానికి, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తానికి చాలా తేడా ఉండటం పలు అనుమానాలకు దారితీస్తుంది. యజమాని అసదుద్దీన్‌ ఆర్థిక లావాదేవీలపై కూడా తాము విచారిస్తున్నట్లు జాయింట్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ మీడియాకు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు