రోహింగ్యాకు అరదండాలు

30 Jul, 2020 09:31 IST|Sakshi

శరణార్థిగా వచ్చి నగర వాసిగా ‘మారిన’ వైనం

అడ్డదారిలో గుర్తింపుకార్డులు

సహకరించిన మీ–సేవా కేంద్ర నిర్వాహకుడు సైతం అరెస్టు 

సాక్షి, సిటీబ్యూరో: మయన్మార్‌ నుంచి బంగ్లాదేశ్‌ మీదుగా భారత్‌కు వలసవచ్చి, నగరంలో శరణార్థిగా స్థిరపడి, దేశ పౌరుడిగా ప్రకటించుకుని గుర్తింపుకార్డులు పొందిన  రోహింగ్యాను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను అక్రమమార్గంలో గుర్తింపుకార్డులు పొందడమేగాక వీటి ఆధారంగా కొన్ని ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధిపొందినట్లు అనుమానిస్తున్నామని అదనపు డీసీపీ చక్రవర్తి పేర్కొన్నారు. బుధవారం ఆయన కేసు వివరాలు వెల్లడించారు. మయన్మార్‌లోని బుథీడంగ్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఫారూఖ్‌ 2009లో ప్రాంతాన్ని వదిలేశాడు. బంగ్లాదేశ్‌ మీదుగా భారత్‌లో ప్రవేశించిన ఇతను మూడేళ్లు జమ్మూకశ్మీర్‌లో ఉన్నాడు.

2011లో హైదరాబాద్‌ చేరుకున్న అతను జల్‌పల్లి ప్రాంతంలో స్ధిరపడ్డాడు. ఇతడికి ఐక్యరాజ్య సమితి జారీ చేసిన శరణార్థి కార్డు ఉంది. ఈ విషయం దాచి పెట్టిన ఫారూఖ్‌ తాను భారతీయుడినే అని క్‌లైమ్‌ చేసుకున్నాడు. మొఘల్‌పురలో రఫాయ్‌ ఆన్‌లైన్‌ మీ సేవా సర్వీస్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న ఖదీరుద్దీన్‌ సహకారంతో ఓటర్‌ ఐడీ తదితర గుర్తింపులు పొందాడు. వీటి ఆధారంగా కొన్ని ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందాడు. ఇతని వ్యవహారంపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్‌.శ్రీశైలం, మహ్మద్‌ తఖ్రుద్దీన్‌ తమ బృందంతో వలపన్ని పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం ఇద్దరు నిందితులను మొఘల్‌పుర పోలీసులకు అప్పగించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు