కోర్టులో షూటౌట్‌; వెలుగులోకి సంచలన విషయాలు

27 Sep, 2021 19:29 IST|Sakshi
టిల్లు తాజ్‌పూరియా.. ఇన్‌సెట్‌లో జితేందర్‌ గోగి

ఢిల్లీలో మోస్ట్‌ వాండెటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ గోగి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జితేందర్‌ను శుక్రవారం రోహిణి కోర్టు ఆవరణలో అందరూ చూస్తుండగా కాల్చి చంపిన సంగతి విదితమే. అతడి హత్యకు ప్రధాన సూత్రధారుడిగా మరో గ్యాంగ్‌స్టర్‌ టిల్లు తాజ్‌పూరియాను పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి బలం చేకూర్చే ఆధారాలు పోలీసులకు లభ్యమయినట్టు సమాచారం. రోహిణి కోర్టు షూటౌట్‌కు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌ ద్వారా టిల్లు తెలుసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

టిల్లు తాజ్‌పూరియా ప్రస్తుతం తీహార్‌లోని మండోలా జైలులో ఉన్నాడు. కారాగారం నుంచే జితేందర్‌ హత్యకు సంబంధించిన విషయాలను తన ఇద్దరు అనుచరుల ద్వారా ఎప్పటికప్పుడు అతడు తెలుసుకున్నట్టు సమాచారం. జితేందర్‌ను కాల్చిచంపిన ఇద్దరు దుండగులు పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. వీరిని ఉమాంగ్‌ యాదవ్‌, వినయ్‌గా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు ఇంటర్‌నెట్‌ కాలింగ్‌ ద్వారా టిల్లుకు వీరిద్దరూ సమాచారం ఇచ్చినట్టు వెల్లడైంది. 


రోహిణి కోర్టుకు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నారు వంటి ప్రశ్నలు.. తన ఇద్దరు అనుచరులను ఫోన్‌లో టిల్లు అడిగినట్టు తెలుస్తోంది. రోహిణి కోర్టుకు చేరుకున్న తర్వాత ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ ఇవ్వాలని ఉమాంగ్‌, వినయ్‌లను ఆదేశించాడట. రోహిణి కోర్టులో షూటౌట్‌కు కొద్ది నిమిషాల ముందు కూడా వారికి కాల్‌ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

‘దాడి చేసిన ఇద్దరూ కోర్టు గది లోపల కూర్చున్నారని.. కోర్టు లోపల, బయటా పోలీసు భద్రత కట్టుదిట్టంగా ఉందని తెలుసుకుని.. తన అనుచరులు తప్పించుకోవడం కష్టమని టిల్లు భావించాడు. దీంతో మరోసారి ఫోన్ చేసి వారి ఆచూకీ గురించి అడిగాడు. వారు పార్కింగ్ స్థలంలో ఉన్నారని చెప్పినప్పుడు అక్కడి నుంచి వెంటనే పారిపోవాలని టిల్లు సూచించాడ’ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఢిల్లీ గ్యాంగ్‌వార్‌: ఒకప్పటి ఫ్రెండ్స్‌.. శత్రువులుగా ఎందుకు మారారు?

మరిన్ని వార్తలు