కష్టపడి చదివిస్తున్నారు.. ఉద్యోగం చేసి నిన్ను, నాన్నని సాకుతానమ్మా అంటివి అంతలోనే..

24 Oct, 2021 15:02 IST|Sakshi
బిడ్డ మరణవార్త తెలిసి విలపిస్తున్న తల్లి మంజుల (ఇన్‌సెట్‌) రోహిత్‌ (ఫైల్‌)   

రైలు నుంచి పడి విద్యార్థి దుర్మరణం 

కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు 

మేలుమాయిలో విషాదఛాయలు

‘‘నన్ను కష్టపడి చదివిస్తున్నారు.. బాగా చదివి ఉద్యోగం చేసి నిన్ను, నాన్నని సాకతానమ్మా.. ఎండల్లో  పనులకు వెళ్లే పనుండదని అంటివే నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా తండ్రీ.. దేవుడా చేతికి అంది వచ్చిన కొడుకును దూరం చేశావే మేము ఏమి చేసేది..’’ అని ఆ తల్లి రోదిస్తున్న తీరును చూసి స్థానికులు కంటతడి పెట్టారు. కుప్పం మండలం మల్లానూరు వద్ద రైలు కిందపడి గంగవరం మండలం మేలుమాయి క్రాస్‌కు చెందిన విద్యార్థి మృతిచెందాడు. దీంతో మేలుమాయిలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

సాక్షి, కుప్పం రూరల్‌/ గంగవరం: కుప్పం మండలంలోని మల్లానూరు వద్ద శనివారం రైలు నుంచి జారి పడి విద్యార్థి మృతిచెందాడు. రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు కథనం మేరకు.. గంగవరం మండలం మేలుమాయి క్రాస్‌ పూజారిండ్లులో ఉంటున్న మురుగేష్, మంజుల దంపతుల కొడుకు రోహిత్‌ (20) నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎన్‌బీకేఆర్‌ఎన్‌ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుప్పంలోని వైసీ జేమ్స్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో సర్టిఫికెట్లు తీసుకునేందుకు శనివారం ఉదయం తిరుపతిలో రైలు ఎక్కాడు. కుప్పం మండలం మల్లానూరు వద్దకు రాగానే డోర్‌ వద్ద ఉన్న రోహిత్‌ అదుపు తప్పి రైలు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టుమార్టమ్‌ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

చదవండి: (పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. ఇప్పుడు శ్రీజతో మరో పెళ్లి..)

కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు  
ఉద్యోగం చేసి బాగా చూసుకుంటానని చెప్పిన కొడుకు రోహిత్‌ దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులతోపాటు తమ్ముడు కిశోర్, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారిని ఇరుగుపొరుగు వారు ఓదార్చే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. రోహిత్‌ తండ్రి మేస్త్రీ పనులు చేస్తుంటాడు. తల్లి వ్యవసాయ కూలి. తమలా కష్టాలు పడకూడదని వారు పిల్లలను మంచి చదువులు చదివిస్తున్నారు. రోహిత్‌ కూడా చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు.

పదవ తరగతి వరకు కల్లుపల్లి జెడ్పీ హైస్కూల్‌లో చదువుకున్నాడు. తర్వాత కుప్పం వైసీ జేమ్స్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఇంటిగ్రేటెడ్‌ కోర్సు పూర్తి చేశాడు. ప్రస్తుతం నాయుడుపేట ఎన్‌బీకేఆర్‌ఎన్‌ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుప్పం వద్ద రైలు కింద పడి మృతిచెందడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చినా చదువుపైనే శ్రద్ధ చూపేవాడని, మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులను బాగా చూసుకుంటానని చెప్పేవాడని, ఇలా శాశ్వతంగా దూరమవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు