హైదరాబాద్‌లో రక్తచరిత్ర

12 Oct, 2020 10:21 IST|Sakshi
చంద్రశేఖరరాజు (ఫైల్‌), వాహెద్‌ అలీ (ఫైల్‌) 

హైదరాబాదు నగరంలో ఆదివారం వేర్వేరుచోట్ల ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. అమీర్‌పేట్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను నలుగురు వ్యక్తులు కత్తులు, తల్వార్లతో పొడిచి దారుణంగా హత్యచేయగా పహాడీషరీఫ్‌ స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్‌ను  గుర్తుతెలియని వ్యక్తులు అంతమొందించారు.    

సాక్షి, అమీర్‌పేట: అమీర్‌పేట ధరంకరం రోడ్డులో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులు, తల్వార్లతో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో కత్తులతో  పొడిచి దారుణంగా  చంపేశారు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్‌  సైదులు తెలిపిన మేరకు..గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కేశన చంద్రశేఖరరాజు (25)కి మచిలీపట్నంకు చెందిన లక్ష్మీగౌరి (22)తో 2019 ఫిబ్రవరి 23న వివాహం జరిగింది. అయితే ఈ సంవత్సరం జూన్‌ 1న లక్ష్మీగౌరి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఈ కేసులో చంద్రశేఖరరాజు జైలుకెళ్లి బెయిలుపై వచ్చాడు.  రోజు బాలానగర్‌ ఏసీపీ కార్యాలయానికి వెళ్లి సంతకాలు చేయాల్సి ఉండటంతో అమీర్‌పేట ధరం కరం రోడ్డులోని పద్మశ్రీ అపార్ట్‌మెంట్‌లోని మేనమామ ఇంట్లో 40 రోజులుగా ఉంటున్నాడు. ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో చికెన్‌ తీసుకురావడం కోసం కిందకు వచ్చాడు. సెల్లార్‌లో అప్పటికే కాపుకాసిఉన్న నలుగురు దుండగులు కత్తులతో శరీరంపై తీవ్రంగా పొడిచారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చంద్రశేఖరరాజు అక్కడికక్కడే మృతి చెందాడు.  దీంతో స్థానికులు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. బంజారాహిల్స్‌ ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌ సైదులు హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు మృతుడి భార్య లక్ష్మీగౌరి సమీప బంధువులే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  

పహాడీషరీఫ్‌: పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఓ రౌడీషీటర్‌ దారుణహత్యకు గురయ్యాడు. ఇన్‌స్పెక్టర్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి తెలిపిన మేరకు.. రాజేంద్రనగర్‌కు చెందిన సయ్యద్‌ వాహెద్‌« అలీ (25) చిన్నతనం నుంచే నేరబాట పట్టాడు. 2016లో ఫలక్‌నుమా ఠాణా పరిధిలో హత్య చేశాడు. ఇతనిపై ఇంకా పలు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇతనిపై బహదూర్‌పురా పోలీసులు రౌడీషీట్‌ కూడా తెరిచారు. జల్‌పల్లి చెరువు కట్టపై ఉన్న గుట్ట రాళ్ల మధ్యలో వాహెద్‌ అలీ మృతదేహం పడి ఉండడాన్ని ఆదివారం సాయంత్రం గమనించిన స్థానికులు పహాడీషరీఫ్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఎల్‌బీ నగర్‌ క్రైమ్‌ డీసీపీ శ్రీనివాస్, వనస్థలిపురం ఇన్‌చార్జి ఏసీపీ ఎం.శంకర్, పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, ఎస్సై కుమార స్వామిలు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మృతుడి మెడ కోసి ఉండడంతో పాటు కడుపు భాగంలో కూడా కత్తిపోట్లు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. డాగ్‌ స్క్వాడ్‌తో నిందితుల జాడ గుర్తించేందుకు ప్రయత్నించారు. కాగా మృతుడిని శనివారం సాయంత్రం ఆదిల్, చాంద్‌ అనే ఇద్దరు విందు చేసుకుందామని తీసుకొచ్చినట్లు మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా వారం క్రితమే బహదూర్‌పురా పోలీసులు షీట్‌ను రాజేంద్రనగర్‌కు బదిలీ చేశారు. పలువురితో శత్రుత్వం ఉన్న వాహెద్‌ అలీని శత్రువులే మట్టు బెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు సంతానం.
 

మరిన్ని వార్తలు