నమ్మించి.. రియల్టర్‌ కిడ్నాప్‌

22 Jun, 2022 09:25 IST|Sakshi

పీఎం పాలెం (భీమిలి): ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి పరిచయమైన రౌడీషీటర్‌ అతడినే కిడ్నాప్‌ చేసేందుకు యత్నించాడు. ఓ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ విషయపై ఒప్పందం చేసుకుందామని పిలిచి.. కారులో ఎక్కించుకుని అపహరించేందుకు ప్రయత్నించాడు. రూ.కోటి ఇస్తేనే విడిచిపెడతానని బెదిరించడంతో... ఆ వ్యాపారి రూ.50 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించాడు. పోలీసుల రంగ ప్రవేశంతో కథ అడ్డం తిరిగింది. దీంతో రియల్టర్‌ను కారులో నుంచి తోసేసి కిడ్నాపర్‌ పరారయ్యాడు. నగర శివారులో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పీఎం పాలెం సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  

భీమిలి ప్రాంతానికి చెందిన టీడీపీ నేత పాచి రామకృష్ణ కొన్నాళ్లుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. అతనిపై మాజీ కార్పొరేటర్‌ విజయారెడ్డి హత్యకేసులో నిందితుడైన రౌడీషీటర్‌ కోలా వెంకట హేమంత్‌ (30) దృష్టి పడింది. సులువుగా డబ్బులు సంపాదించేందుకు రామకృష్టకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తాను అలకనందా రియల్‌ ఎస్టేట్‌లో పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. బాగా నమ్మకం పెరిగాక ఓ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ విషయపై ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.

ఈ క్రమంలో మంగళవారం రుషికొండ సమీపానికి వస్తే ఒప్పందం పూర్తి చేసుకుందామని రామకృష్ణను హేమంత్‌ పిలిచాడు. నిజమేనని నమ్మిన రామకృష్ణ రుషికొండ వెళ్లగా... ముందుగా రచించుకున్న ప్రణాళిక ప్రకారం కారులో కూర్చున్న రామకృష్ణను హేమంత్‌ తాళ్లతో బంధించాడు. కోటి రూపాయలు చెల్లిస్తేనే విడిచిపెడతానని బెదిరించాడు. అనంతరం కారును విజయనగరం వైపు తీసుకుని బయలుదేరాడు.

సీసీ కెమెరా పుటేజీతో అప్రమత్తం  
రామకృష్ణను హేమంత్‌ బెదిరించి కారులో తీసుకెళ్లిపోతున్న తతంగం అంతా సమీపంలోని ఓ రిసార్టు సీసీ కెమెరాలో రికార్డు కాగా గమనించిన అక్కడి సిబ్బంది విషయాన్ని నగర సీపీ సీహెచ్‌ శ్రీకాంత్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన సీపీ పీఎంపాలెం పోలీసులను అప్రమత్తం చేశారు. కిడ్నాపర్‌ వాడుతున్న కారు డ్రైవర్‌ సెల్‌ ఫోను నంబరు లొకేషన్‌ ఆధారంగా కారుని గుర్తించి పోలీసులు వెంబడించారు. అప్పటికే బాధితుడు రామకృష్ట తనను విడిచిపెడితే రూ.50 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఇంతలో పోలీసులు తనను వెంబడిస్తున్నారని తెలుసుకున్న కిడ్నాపర్‌ హేమంత్‌ కథ అడ్డం తిరిగిందని భావించి రామకృష్ణను కారు లోనుంచి బయటకు తోసేసి  పరారయ్యాడు. అనంతరం జరిగిన సంఘటనపై రామకృష్ణ పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం డీసీపీ గరుడ సుమిత్‌ సునీల్‌ పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర వివరాలు సేకరించారు. ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న విషయమై ఆరా తీశారు.  

హత్య కేసులో జైలుకెళ్లి వచ్చి...  
కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు కోలా వెంకట హేమంత్‌కు కరుడుగట్టిన నేర చరిత్ర ఉంది. భీమిలి పోలీస్‌ స్టేషన్‌లో గతంలో రౌడీషీట్‌ తెరిచారు. భూ దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తుంటాడు. ఈ క్రమంలో అనేక కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. కొన్నేళ్ల కిందట నగరంలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్‌ లీడర్, మాజీ కార్పొరేటర్‌ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు. రూ.1.35 కోట్ల విలువైన ప్లాటు కొనుగోలు విషయమై విజయారెడ్డి ఇంటికి వెళ్లి మరీ భయంకరంగా హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి బంగారు నగలు అపహరించుకుని ఆమె కారులోనే పరారయ్యాడు. నగలు విక్రయించగా వచ్చిన డబ్బులతో ప్రియురాలితో కలిసి విజయవాడలో జల్సాలు చేశాడు. ఈ కేసులో నాలుగో పట్టణ పోలీసులు హేమంత్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. అనంతరం బయటకు వచ్చినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.  

(చదవండి: ఆహ్లాదం మాటున సుడి‘గండాలు’)

మరిన్ని వార్తలు