కళ్లలో కారం చల్లి.. కత్తులతో దాడి చేసి..

6 Jan, 2021 09:12 IST|Sakshi
సంఘటన స్థలాన్ని సందర్శిస్తున్న అడినషల్‌ ఎస్పీ కుమార్‌ సూర్య నారాయణ రెడ్డి (పైల్‌)

జి.మామిడాడలో రౌడీషీటర్‌ హత్య

సంఘటన స్థలాన్ని సందర్శించిన జిల్లా అడిషనల్‌ ఎస్పీ కుమార్‌

సాక్షి, పెదపూడి(తూర్పు గోదావరి): జి.మామిడాడలో రౌడీషీటర్‌ హత్యకు గురైనట్టు కాకినాడ రూరల్‌ సీఐ మురళీకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గ్రామంలో డీఆర్‌కే నగర్‌లో రౌడీషీటర్‌ మేడపాటి సూర్యనారాయణరెడ్డి(30) అలియాస్‌ యాసిడ్‌ సూరి అనే వ్యక్తి జీవిస్తున్నాడు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఐదుగురు గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి సూర్యనారాయణరెడ్డి కళ్లల్లో కారం చల్లి కత్తులతో అతడిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అతడి గొంతుపై తీవ్రగాయలయ్యాయి. భర్తపై దాడి చేస్తున్న సమయంలో అడ్డుకున్న భార్య శ్రావ్య చేతిపైనా గాయాలయ్యాయి. ఆమె మెడలోని పుస్తెల తాడు లాక్కొని దుండగులు పరారయ్యారు. వెంటనే సూర్యనారాయణరెడ్డిని 108 వాహనంలో పెదపూడి సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రావ్యకు చికిత్స అందించారు. శ్రావ్య ఫిర్యాదు పై స్థానిక ఎస్సై టి.క్రాంతికుమార్‌ కేసు నమోదు చేయగా, సీఐ దర్యాప్తు చేస్తున్నారు.  మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం కాకినాడ తరలించారు. మృతుడు గతేడాది మార్చిలో గ్రామంలో జరిగిన ఓ హత్య కేసులో నిందుతుడిగా ఉన్నాడు.

సంఘటన స్థలాన్ని సందర్శించిన జిల్లా అడిషనల్‌ ఎస్పీ  
జి.మామిడాడలో హత్య జరిగిన స్థలాన్ని జిల్లా అడిషనల్‌ ఎస్పీ కరణం కుమార్, డీఎస్పీ భీమారావు సందర్శించారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బాధితులు, చుట్టు పక్కల వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌టీమ్, డాగ్‌ స్క్వాడ్‌ రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నాయి. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సంఘటన స్థలంలో కరప, గొల్లపాలెం ఎస్సైలు డి.రామారావు, పవన్‌కుమార్‌ ఉన్నారు. పోలీసు పికెట్‌ కొనసాగుతుంది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. (చదవండి: ఏమైంది తల్లీ...)

గొంతు కోసుకొని.. బ్రిడ్జిపై నుంచి దూకి.. 

ఏం కష్టం వచ్చిందో తెలియదు.. జిల్లాలో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పిఠాపురంలో మణికంఠ అనే వ్యక్తి బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తే.. అమలాపురం రూరల్‌ పరిధిలో బోడసకుర్రు బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు.  వీరిద్దరినీ స్థానికులు సకాలంలో రక్షించి ఆసుపత్రికి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతున్నారు. 

జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నం  
పిఠాపురం: ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన పిఠాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. మంగళవారం పిఠాపురం పక్షులమర్రి సెంటర్‌ వీధిలో గుర్తు తెలియని వ్యక్తి బ్లేడుతో తన కంఠాన్ని కోసుకున్నాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న అతడిని పట్టణ ఎస్సై శంకర్రావు ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం అతడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గొంతు కోసుకున్న వ్యక్తి మాట్లాడే పరిస్థితిలో లేకపోవడం, అతడిని ఎవరూ గుర్తుపట్టక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నంగా పోలీసులు కేసు నమోదుకు సిద్ధమయ్యారు.

ఇంతలో ఆ వ్యక్తి తమవాడేనంటూ అతడి బంధవులు రావడంతో కాకినాడ జగన్నాథపురానికి చెందిన చింతా మణికంఠగా పోలీసులు గుర్తించారు. బాధితుడు వడ్రంగి పని చేస్తుంటాడని, ఇటీవల రౌతులపూడిలో వడ్రంగి పనికి వెళ్లి అక్కడ పని చేస్తూ రెండు రోజుల క్రితం ఇంటి వచ్చేస్తున్నట్టు బంధువులకు సమాచారం ఇచ్చాడని, కానీ ఇంటికి వెళ్లలేదు. ఇంతలో మంగళవారం పిఠాపురంలో గొంతు కోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం అంటు సోషల్‌ మీడియాలో కథనం రావడంతో గుర్తుపట్టిన బంధువులు పోలీసులను సంప్రదించి వివరాలు తెలిపారు. పట్టణ ఎస్సై శంకరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదని, అతడు అప్పుడప్పుడూ మానసికంగా బాధపడుతుంటాడని బంధువులు తెలిపారు.

బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి దూకి.. 
అల్లవరం: అమలాపురం రూరల్‌ పరిధిలోని తాండవపల్లి గ్రామానికి చెందిన సత్తి శ్రీమన్నారాయణ బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి మంగళవారం సాయంత్రం వైనతేయ నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అమలాపురం నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ బ్రిడ్జిపై సైకిల్, చెప్పలు వదిలి పై నుంచి నదిలోకి దూకేశాడు. బ్రిడ్జి కింద చేపల వేట సాగిస్తున్న బొమ్మిడి ముత్యాలరావు  ఇది గమనించి అతడిని కాపాడి తన బోటులో స్థానికుల సహకారంతో గట్టుకి చేర్చాడు. బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకడంతో శ్రీమన్నారాయణ నడుముకి దెబ్బ తగిలిందని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై 108కి సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకుని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారని స్థానికుడు పరమేష్‌ తెలిపారు. అపస్మారక స్థితి నుంచి తేరుకున్నాక తన పేరు మాత్రమే చెప్పాడని, ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో  చెప్పలేదని స్థానికులు తెలిపారు. 

మరిన్ని వార్తలు