బెంగళూరులో రూ.3.30 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత

24 Sep, 2020 13:11 IST|Sakshi

బనశంకరి: బెంగళూరులో పార్కింగ్‌ స్థలాల్లో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను సిటీ మార్కెట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద ఉన్న రూ.1 కోటి 10 లక్షల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. రాజారామ్‌ బిష్ణోయ్, సునీల్‌కుమార్‌ అనే ఇద్దరు వ్యక్తులు సిటీమార్కెట్‌ సమీపంలో పార్కింగ్‌ స్థలంలో మత్తు పదార్థాలను అమ్ముతున్నట్లు పోలీసులకు తెలిసింది. సీఐ కుమారస్వామి పోలీస్‌ సిబ్బంది దాడిచేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌చేసి 125 గ్రాముల హఫీం, 150 గ్రాముల బ్రౌన్‌షుగర్‌, 25 ఎల్‌ఎస్‌డీ స్టిక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా, భారీ డ్రగ్స్‌ డంప్‌ గురించి బయటపెట్టారు. దాని ఆధారంగా మొత్తం రూ.3.30 కోట్ల విలువగల మాదక ద్రవ్యాలను సీజ్‌ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసు – ఏసీపీ, హెడ్‌ కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌
శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణలో భాగంగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసును సీసీబీ పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ–1 వీరేశ్‌ఖన్నాతో రూ.50 లక్షలు ఒప్పందం చేసుకున్న ఏసీపీ, హెడ్‌ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఏసీపీ ఎంఆర్‌ ముధవి, హెడ్‌కానిస్టేబుల్‌ మల్లికార్జున్‌పై వేటు పడింది. మాదక ద్రవ్యాల వ్యాపారం, విక్రయాలు, వినియోగం విషయంలో నిందితులతో సంబంధాలు పెట్టుకున్నట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో ఇద్దరు పోలీసు అధికారులను విధుల నుంచి తొలగించారు. వీరేశ్‌ఖన్నాతో ఏసీపీ ముధవి రూ.50 లక్షలు ఒప్పందం చేసుకోగా.. మధ్యవర్తిగా హెడ్‌ కానిస్టేబుల్‌ మల్లికార్జున్‌ వ్యవహరించినట్లు సమాచారం. కాగా డ్రగ్స్‌ కేసులో నటీమణులు రాగిణి, సంజన జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు