రూ.7 కోట్లకు రియల్‌ బురిడీ!

12 Jun, 2021 05:02 IST|Sakshi
విజయవాడలోని ఎంకే కన్స్‌ట్రక్షన్స్‌ కార్యాలయం

ప్రీ లాంచింగ్‌ ఆఫర్‌ పేరిట వసూలు 

తరువాత పత్తాలేని ఎంకే కన్‌స్ట్రక్షన్స్‌ ప్రతినిధులు 

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు 

సాక్షి, అమరావతి: ప్రీలాంచింగ్‌ ఆఫర్ల పేరుతో రూ.7 కోట్ల వరకు వసూలు చేసిన రియల్‌ఎస్టేట్‌ సంస్థ ఎంకే కన్‌స్ట్రక్షన్స్‌ తమను మోసగించిందని పలువురు బాధితులు శుక్రవారం విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ మహానాడు రోడ్డు సమీపంలోని ఆ సంస్థ కార్యాలయం వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు మేరకు.. విజయవాడ సమీపంలోని గన్నవరం మండలంలో 15 ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేస్తున్నట్టు ఎంకే కన్‌స్ట్రక్షన్స్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆ సంస్థ ప్రతినిధులుగా విశాఖకు చెందిన పట్నాల శ్రీనివాసరావు, విజయవాడ రూరల్‌ మండలానికి చెందిన మనోజ్‌కుమార్, రవితేజలు పకడ్బందీ మార్కెటింగ్‌ వ్యూహంతో అందర్నీ నమ్మించారు. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయంతోపాటు విజయవాడ బ్రాంచి ఏర్పాటు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్నామని చెప్పారు. పలువురిని ఏజెంట్లుగా నియమించుకున్నారు.

ప్రీలాంచింగ్‌ ఆఫర్‌గా నిర్మాణానికి ముందే డబ్బులు చెల్లిస్తే రూ.35 లక్షల ఫ్లాట్‌ను రూ.18 లక్షలకే ఇస్తామని నమ్మించారు. అపార్ట్‌మెంట్‌ నిర్మాణం పూర్తయ్యేవరకు రూ.2 వంతున వడ్డీ కూడా చెల్లిస్తామన్నారు. ఫ్లాట్లు బుక్‌ చేసే ఏజెంట్లకు మంచి కమీషన్ల ఆశ చూపించారు. దీంతో పలువురు ఏజెంట్లు పెద్దసంఖ్యలో ప్రీలాంచింగ్‌ ఫ్లాట్లు బుక్‌ చేయించడమే కాకుండా వారు కూడా ఫ్లాట్ల కొనుగోలుకు డబ్బులు చెల్లించారు. ఆ విధంగా సంస్థకు రూ.7 కోట్ల వరకు సొమ్ము వచ్చింది. కొన్ని నెలలుగా సంస్థ ప్రతినిధులు పట్నాల శ్రీనివాసరావు, మనోజ్‌కుమార్, రవితేజల ఆచూకీ కనిపించడంలేదు. ఫోన్లలో కూడా అందుబాటులో లేరు. ఎంకే కన్‌స్ట్రక్షన్స్‌ హైదరాబాద్‌ ఆఫీసును సంప్రదించినా ఫలితం లేకపోయింది. దాంతో తాము మోసపోయామని గుర్తించిన కొనుగోలుదారులు, ఏజెంట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై సంస్థ ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా వారి ఫోన్లన్నీ స్విచ్చాఫ్‌లో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు