సినీ ఫక్కీలో చోరీ

27 Aug, 2020 05:07 IST|Sakshi
హైజాక్‌ అయిన కంటైనర్‌ను పరిశీలిస్తున్న పోలీసులు (ఇన్‌సెట్‌లో) గాయపడిన డ్రైవర్‌ మహమ్మద్‌ ఇర్ఫాన్‌

రవాణా కంటైనర్‌ను హైజాక్‌ చేసిన దుండగులు

రూ.7 కోట్ల విలువైన సెల్‌ఫోన్లతో పరార్‌

చిత్తూరు జిల్లాలో ఘటన  

నగరి (చిత్తూరు జిల్లా): తమిళనాడులోని శ్రీపెరంబదూరు ఫ్లెక్స్‌ ఇండియా కంపెనీ నుంచి ముంబైకి రెడ్‌మీ సెల్‌ఫోన్ల లోడు తీసుకెళ్తున్న కంటైనర్‌ను సినీ ఫక్కీలో హైజాక్‌ చేసి.. అందులోని రూ.7 కోట్ల విలువైన ఫోన్లను ఎత్తుకుపోయిన ఘటన చిత్తూరు జిల్లా నగరి–పుత్తూరు మధ్య జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం బయలుదేరిన కంటైనర్‌ను మరో రెండు లారీలు వెంబడిస్తూ వచ్చాయి.

సెల్‌ఫోన్లతో వస్తున్న కంటైనర్‌ మంగళవారం రాత్రి నగరి మండలంలోని తడుకుపేట వద్ద గల ఆంధ్రా చెక్‌పోస్టు దాటగానే రెండు లారీలపై వచ్చిన దుండగులు కంటైనర్‌ డ్రైవర్‌ మహమ్మద్‌ ఇర్ఫాన్‌పై దాడి చేశారు. అతడి కాళ్లు, చేతులు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి కళ్లకు గంతలు కట్టారు. ఆ తరువాత కంటైనర్‌ను హైజాక్‌ చేశారు. అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అనంతరం డ్రైవర్‌ను కింద పడేసి కంటైనర్‌ను తీసుకుపోయారు. గాయాల పాలైన ఇర్ఫాన్‌ మంగళవారం రాత్రి 10 గంటలకు నగరి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. విచారణ ప్రారంభించిన పోలీసులు బుధవారం ఉదయం పుత్తూరు శివారులో రోడ్డుపై వదిలి వెళ్లిన కంటైనర్‌ను కనుగొన్నారు.

సగం సెల్‌ఫోన్లు ఎత్తుకుపోయారు 
► కంటైనర్‌లో 16 బాక్సుల రెడ్‌మీ ఫోన్లు తీసుకురాగా.. దుండగులు వదలివెళ్లిన లారీలో 8 బాక్సులు మాత్రమే ఉన్నాయి.  
► మిగిలిన 8 బాక్సులను దుండగులు వారు తెచ్చిన లారీల్లోకి ఎక్కించి తీసుకెళ్లినట్టు భావిస్తున్నారు. 
► కంటైనర్‌లో తెచ్చిన సెల్‌ఫోన్ల విలువ వే బిల్‌ ప్రకారం రూ.14 కోట్లు కాగా.. చోరీకి గురైన సెల్‌ఫోన్ల విలువ రూ.7 కోట్లుగా తేలింది. 
► సెల్‌ఫోన్లు పంపిన సంబంధిత కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు. 
► గాయపడిన డ్రైవర్‌ ఇర్ఫాన్‌ను ఆస్పత్రికి తరలించారు. సీఐ రాజశేఖర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు