బస్‌లో టిక్కెట్‌ గొడవ.. కండక్టర్‌ మృతి

15 May, 2022 13:40 IST|Sakshi

సాక్షి, చెన్నై: టిక్కెట్‌ తీసుకోమన్న కండక్టర్‌ను ఓ మందుబాబు కొట్టి చంపేశాడు. మధురాంతకం సమీపంలో శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాలు.. కోయంబేడు నుంచి విల్లుపురానికి ప్రభుత్వ బస్సు ఉదయం బయలుదేరింది. ఇందులో కళ్లకు రిచ్చికి చెందిన పెరుమాల్‌(56) కండక్టర్‌గా ఉన్నారు. మధురాంతకం బైపాస్‌లో ఓ యువకుడు బస్సులోకి ఎక్కాడు. టిక్కెట్టు తీసుకోవాలని కండక్టర్‌ ఆ యువకుడికి సూచించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు తననే టిక్కెట్టు అడుగుతావా...? అంటూ కండక్టర్‌పై దాడి చేశాడు. ఇతర ప్రయాణికులు అడ్డుకుని.. మార్గం మధ్యలోని అయ్యనార్‌ ఆలయం వద్ద ఆ యువకుడిని కిందికి దింపేశారు.

కాసేపటికే..మృతి 
బస్సు కొంత దూరం వెళ్లగానే కండెక్టర్‌  స్పృహ తప్పాడు. దీనిని గుర్తించిన డ్రైవర్, ఇతర ప్రయాణికులు మేల్‌ మరువత్తూరు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కండెక్టర్‌ మరణించినట్లు వైద్యులు తేల్చారు. ఆయన ఛాతిపై ఆ మందుబాబు బలంగా కొట్టడం వల్లే మరణించి ఉంటాడని నిర్ధారించారు. మేల్‌ మరువత్తూరు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు సమీప గ్రామానికి చెందిన మురుగన్‌(35)గా గుర్తించి అరెస్టు చేశారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెరుమాల్‌ కుటుంబానికి రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

చదవండి: వాట్‌ ఏ స్కెచ్‌: ప్రేమోన్మాది యాసిడ్‌ దాడి.. రెండువారాల తర్వాత సన్యాసి గెటప్‌లో..

మరిన్ని వార్తలు