నెలకు లక్ష జీతం.. రమ్మీకి బానిసై, కుటుంబ పరిస్థితి భారంగా మారడంతో..

5 Jan, 2022 22:41 IST|Sakshi

సాక్షి, చెన్నై: తిరువాన్మీయూరు రైల్వే స్టేషన్‌లో సంచలనం రేపిన దోపిడీ కథ ముగిసింది. భార్యతో కలిసి రైల్వే ఉద్యోగి ఆడిన నాటకం గుట్టు రట్టయ్యింది. ఇంటి దొంగను అరెస్టు చేసిన పోలీసుల కటకటాల్లోకి నెట్టారు. చెన్నై తిరువాన్మీయూరు ఎంఆర్‌టీఎస్‌ రైల్వే స్టేషన్‌లో సోమవారం ఉదయం దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు తనను కట్టి పడేసి రూ. లక్షా 32 వేలు నగదు అపహరించుకెళ్లినట్టు రైల్వే టికెట్‌ క్లర్‌ టిక్కారామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్‌లో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు ముందుకు సాగడం కష్టతరంగా మారింది.

అయితే, రైల్వే స్టేషన్‌ మార్గంలో ఉన్న సీసీ కెమెరాల్ని పరిశీలించిన పోలీసులు విస్మయానికి గురయ్యారు. దోపిడీ జరిగిన సమయంలో ఓ మహిళ రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆగమేఘాల మీద వెళ్లిన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఆమె టిక్కారామ్‌ భార్య సరస్వతిగా తేలింది. దీంతో ఇంటి దొంగ నాటకం గుట్టు బట్టబయలైంది. నెలకు దాదాపుగా రూ. లక్ష వరకు  జీతం తీసుకుంటున్న టిక్కారామ్‌ ఆన్‌లైన్‌ రమ్మికి బానిస అయ్యాడు.  దీంతో లక్షల చొప్పున అప్పుల పాలయ్యాడు. ఈ నెల కుటుంబ పరిస్థితి భారంగా మారడం, స్టేషన్‌లో సీసీ కెమెరాలు లేవన్న విషయాన్ని పరిగణించి భార్యతో కలిసి నాటకం రచించి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ  దంపతుల్ని అరెస్టు చేసిన పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.

మరిన్ని వార్తలు