ప్రేమ పేరుతో వంచించి.. నగ్న వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి.. 

22 Aug, 2021 04:50 IST|Sakshi
రోహిత్‌కుమార్‌ , దండగల గణేష్‌

స్నేహితుడితో కలిసి ఓ ప్రేమికుడి పైశాచికం 

విజయవాడలో ఘటన ∙ఇద్దరు నిందితుల అరెస్టు  

విజయవాడ స్పోర్ట్స్‌: నీతో స్నేహం కావాలని వెంటపడితే ఆ యువతి అతడిని నమ్మి స్నేహం చేసింది.. ఆ తర్వాత నిన్ను ప్రేమిస్తున్నానంటే నిజమేనని నమ్మింది. అతడిలోని నయవంచనను గ్రహించలేని యువతి తన నగ్న వీడియోలను కూడా పంపింది. తర్వాత ఇద్దరికీ మనస్పర్థలు తలెత్తడంతో ఆ వీడియోలను యువకుడు తన స్నేహితుడితో సోషల్‌ మీడియాలో పోస్టు చేయించాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఇద్దరు నిందితులను విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ బి.రాజారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బిహార్‌కు చెందిన రోహిత్‌కుమార్‌ మూడేళ్ల క్రితం విజయవాడలో డిగ్రీ చదువుతున్న ఓ యువతి వెంట పడ్డాడు.

ఆ యువతి అతడితో స్నేహం చేసింది. ఇదే అదునుగా భావించిన రోహిత్‌కుమార్‌ ఆమె స్నేహాన్ని ప్రేమగా మార్చాడు. అతడిని పూర్తిగా నమ్మిన యువతి ఆమె నగ్న వీడియోలను అతడికి పంపింది. ఇటీవల ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఎలాగైనా ఆమెను వేధించాలనుకున్న రోహిత్‌ కృష్ణలంకకు చెందిన తన స్నేహితుడు దండగల గణేష్‌కు యువతి నగ్న వీడియోలను పంపాడు. గణేష్‌ అదే యువతి పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాను తెరిచి.. అందులో ఆమె చిత్రాలను, నగ్న వీడియోలను పోస్టు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు యువతి న్యాయం చేయాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి మూడు రోజుల రిమాండ్‌ విధించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు