సైదాబాద్‌ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య

16 Sep, 2021 10:52 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: సైదాబాద్‌ చిన్నారి అత్యాచారం, హత్యకేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్-ఘట్కేసర్ మార్గంలో స్టేషన్ ఘన్‌పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం కనిపించింది. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా రాజు మృతదేహాన్ని గుర్తించారు. 8 రోజులుగా రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పంచనామా అనంతరం రాజు మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి  తరలించారు. సంఘటన స్థలాన్ని సీపీ తరుణ్ జోషి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్ రాజారాం బ్రిడ్జి నంబరు-436 వద్ద రాజు తిరిగాడని.. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడినట్లు రైల్వే కార్మికులు చెప్పినట్లుగా సీపీ వెల్లడించారు.

రాజు మృతదేహాన్ని ముందుగా గమనించిన రైల్వే కార్మికులు డయల్‌ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా నిందితుడు రాజుగా పోలీసులు గుర్తించారని చెప్పారు. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో తోటిపిల్లలతో కలసి ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి గురువారం (సెప్టెంబర్‌ 9) చాక్లెట్‌ ఆశ చూపి తీసుకెళ్లి నిందితుడు రాజు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే.

చిన్నారి తల్లిదండ్రులు నల్లగొండ జిల్లా దేవరకొండ సమీప తండాకు చెందిన గిరిజన కుటుంబం. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి సింగరేణి కాలనీలో నివసిస్తోంది. ఈ సమయంలోనే ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు సంఘాలు, సామాజికవేత్తలు నిరసనలు తెలిపారు. హైదరాబాద్‌ పోలీసులు ఈ కేసులో నిందితుడైన రాజు ఆచూకీ తెలియజేసిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. నిందితుడు రాజు కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. గాలింపులో భాగంగా  నిందితుడు రాజు స్నేహితుడు పోలీసులకు దొరికాడు. హైదరాబాద్ టాస్క‌ఫోర్స్ అదుపులో నిందితుడు రాజు స్నేహితుడు దొరికాడు.

చదవండి: సైదాబాద్‌ ఘటన: రూ. 20 లక్షలు చెక్కును తిరస్కరించిన బాధిత కుటుంబం

పోలీసులు సీసీ ఫుటేజ్‌ పరిశీలించగా రాజు ఎల్బీనగర్ నుంచి ఉప్పల్‌ వైపు వెళ్లినట్లు గుర్తించారు. అయితే రాజుకు తోడుగా ఎల్బీనగర్‌ వరకు అతడి స్నేహితుడు వచ్చాడు. సీసీ ఫుటేజ్‌లో అతడు కూడా కనిపించాడు. అనంతరం ఎల్బీనగర్‌ నుంచి రాజు ఒంటరిగా వెళ్లారు. అయితే పారిపోయే ముందు రాజు ఎల్బీనగర్‌లో ఆటో దొంగతనానికి యత్నించాడు. ఆటో డ్రైవర్ అప్రమత్తతో రాజు పరారయ్యాడు. అక్కడి నుంచి నాగోల్ వరకు బస్సులో వెళ్లాడు. నాగోల్‌లోని ఓ వైన్ షాప్‌ వద్ద మద్యం సేవించి అటు నుంచి బస్సులో ఉప్పల్ వెళ్లాడు. అక్కడి నుంచి ఘట్‌కేసర్ వైపు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు