కేవలం రూ.160 కోసమే గొంతు కోసి చంపి...

27 Jul, 2022 06:52 IST|Sakshi

నాంపల్లి: లక్డీకాపూల్‌ టెలిఫోన్‌ భవన్‌ సమీపంలోని బస్టాప్‌ వద్ద ఈ నెల 24న జరిగిన హత్య కేసును సైఫాబాద్‌ పోలీసులు చేధించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మధ్య మండలం డీసీపీ రాజేష్‌ చంద్ర, అడిషనల్‌ డీసీపీ రమణారెడ్డి, సైఫాబాద్‌  ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి మంగళవారం వివరాలు వెల్లడించారు. జహీరాబాద్, రామ్‌నగర్‌కు చెందిన బోయిన మహేష్‌ కర్ణాటక రాష్ట్రం, కలబుర్గి జిల్లా,  డంజార్గావ్‌కు చెందిన జె.అనిల్‌కుమార్‌ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. అడ్డా కూలీలుగా పని చేస్తూ  ఫుట్‌పాత్‌లపై నివాసం ఉండేవారు. ఈ క్రమంలో ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వ్యక్తులను బెదిరించి డబ్బులు లాక్కుని జల్సా చేసేవారు.

ఈ నెల 24న లక్డీకాపూల్‌ బస్టాపు వద్ద నిద్రిస్తున్న ఓ యాచకుడిని టార్గెట్‌ చేసుకున్న వారు కత్తితో అతడి గొంతు కోసి జేబులో ఉన్న రూ.160 నగదును తీసుకుని పారిపోయారు. రక్తం మడుగులో ఓ వ్యక్తి కొట్టుమిట్టాడుతున్నారంటూ పోలీసులకు సమాచారం అందడంతో సైఫాబాదు పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం అతను మృతి చెందాడు. కేసును నమోదు చేసుకున్న  పోలీసులు ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు.

సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించిన పోలీసులు బోయిన మహేష్, జె.అనిల్‌ కుమార్‌లను నిందితులుగా గుర్తించారు. నాంపల్లి, బజార్‌ఘాట్‌లోని కాలభైరవ దేవాలయం వద్ద వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులు నేరం అంగీకరించడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని మరింత సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని డీసీపీ తెలిపారు. కేసును చేధించిన ఇన్‌స్పెక్టర్‌ సత్తయ్య, ఎస్సై మాధవి, కానిస్టేబుళ్లు అజీముద్దీన్, అహ్మద్‌ షా ఖాద్రీలను డీసీపీ అభినందించారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లకు నగదు రివార్డులను అందజేశారు.  

(చదవండి: ఫామ్ హౌస్‌లో గుట్టుగా సెక్స్ ‍రాకెట్.. బీజేపీ నేత అరెస్టు)

మరిన్ని వార్తలు