లైంగిక వేధింపులు బయట పడుతాయని హత్య.. నిందితుడికి ఉరిశిక్ష

27 Apr, 2022 10:24 IST|Sakshi
దినేష్‌ కుమార్‌ (ఫైల్‌)

సేలం( తమిళనాడు): మైనర్‌ తల నరికి దారుణంగా హత్య చేసిన వ్యక్తికి ఉరిశిక్ష, రూ. 25 వేలు జరిమానా విధిస్తూ సేలం కోర్టు మంగళవారం తీర్పిచ్చింది. వివరాలు.. సేలం జిల్లా, ఆత్తూర్‌ సమీపంలో తలవాయ్‌పట్టి గ్రామానికి చెందిన దినేష్‌కుమార్‌ (33) వరికోత వాహనంలో పని చేస్తున్నాడు. ఇతను 2018, అక్టోబర్‌ 20న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదేప్రాంతంలో ఉన్న దళిత వర్గానికి చెందిన సామువేల్‌ కుమార్తె అయిన మైనర్‌ పువ్వులు కట్టడానికి దారం కోసం వచ్చింది. అప్పుడు దినేష్‌కుమార్‌  ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు.

దీంతో ఆమె తల్లిదండ్రులకు చెబుతానంటూ వెళ్లిపో యింది. లైంగిక వేధింపుల విషయం ఎక్కడ బయట పడిపోతుందోననే భయంతో దినేష్‌ కుమార్‌ ఆమెను ఇంటికి వెళ్లి దూషించాడు. అంతటితో ఆగకుండా తల్లి కళ్ల ఎదుటే ఆమె తలను తెగనరికి హత్య చేశాడు. తర్వాత  ఆత్తూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ హత్యపై పోలీసులు ఐదు విభాగాల కింద కేసు నమోదు చేసి దినేష్‌ కుమార్‌ను అరెస్టు చేశారు. దళిత వర్గానికి చెందిన మైనర్‌ దారుణ హత్యకు గురైన ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ కేసుపై సేలం ఫోక్సో ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ తరపు న్యాయవాది ఎ.ఆసైతంబి వాదించారు.   

మరెవరికీ..
కేసు విచారణ ముగిసి మంగళవారం న్యాయమూర్తి ఎం.మురుగానంద్‌ తుది తీర్పు ఇచ్చారు. హత్య చేసినందుకు దినేష్‌ కుమార్‌కు ఉరిశిక్ష, రూ. 5 వేలు జరిమానా విధించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా జీవిత ఖైదు, రూ. 5 వేలు జరిమానా, మరో మూడు విభాగాల కింద 10, 6 సంవత్సరాలు, 4 నెలలు జైలు శిక్షను, తలా రూ. 5 వేలు వంతున జరిమానా విధించారు. మైనర్‌ తల్లిదండ్రులు సామువేల్, చిన్నపొన్ను మాట్లాడుతూ.. తమ కుమార్తెకు జరిగిన దారుణం మరెవరికీ జరగకూడదని, ఈ తీర్పు తమకు కాస్త ఊరట నిచ్చినట్లు తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: కనికరించలేదు.. సింగపూర్‌లో ‘మానసిక వికలాంగుడు’ నాగేంద్రన్‌ను ఉరి తీశారు

మరిన్ని వార్తలు