ఇసుక రీచ్‌ల పేరిట భారీ మోసం: రూ.కోట్లకు టోకరా

10 Jun, 2021 13:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: ఏపీలో ఇసుక రీచ్‌ల పేరిట ఓ వ్యక్తి భారీ మోసాకి పాల్పడ్డాడు. ఇసుక రీచ్‌లకు సంబంధించి తవ్వకాల సబ్‌ లీజులు ఇస్తానని చెప్పి రూ.కోట్లకు టోకరా వేశాడు. వివిధ జిల్లాలకు చెందిన ఏడుగురి నుంచి రూ.3.50 కోట్లు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా ఆ కేటుగాడు గనుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది సంతకం ఫోర్జరీ చేశాడు. సంతకం ఫోర్జరీ చేసి ఫేక్‌ డాక్యుమెంట్లు సృష్టించి ఈ మోసాలకు తెగపడ్డాడు. జేపీ గ్రూప్‌ నుంచి తాను సబ్‌కాంట్రాక్ట్‌ తీసుకున్నట్లు నమ్మబలికాడు.

ఈ విషయంపై జేపీ గ్రూప్‌ మేనేజర్‌ హర్షకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీనిపై దర్యాప్తు చేసిన విజయవాడ భవానీపురం పోలీసులు నిందితుడు కాకినాడకు చెందిన సతీష్‌కుమార్‌గా గుర్తించారు. నిందితుడు సతీష్‌పై 471, 420, 465, 469, 471, 120(బి) సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందితుడు బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.2 కోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం ప్రత్యేక  బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
చదవండి: అమానుషం: పసికందును డ్రైనేజీలో పడేసిన తల్లి

మరిన్ని వార్తలు