సంజన ఫ్లాట్స్‌కు నటులు, సంగీత దర్శకులు

12 Sep, 2020 07:13 IST|Sakshi

బెంగళూరు : డ్రగ్స్‌ కేసు దర్యాప్తు లోతుగా కొనసాగుతోంది. డ్రగ్స్‌ వినియోగం, రవాణాపై ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన నటీమణులు రాగిణి, సంజనాతో పాటు ఆరుగురిని సీసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. బెంగళూరు జాయిట్‌ పోలీసు కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ శుక్రవారం ఉదయం మహిళా సాంత్వన కేంద్రానికి వెళ్లి నటీమణులు రాగిణి, సంజనలపై ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీలకు ఎవరెవరు వచ్చేవారు, ఎప్పటి నుంచి పార్టీలను నిర్వహిస్తున్నారనే వివరాలు సేకరించారు. కొందరు రాజకీయ నాయకుల పుత్రులు మత్తు పదార్థాలను తీసుకొనేవారని రాగిణి, సంజనాలు వెల్లడించినట్లు తెలిసింది. విచారణలో వారు వెల్లడించిన వివరాల మేరకు సదరు రాజకీయ నేతల పుత్రులకు నోటీసులు ఇవ్వాలని సీసీబీ పోలీసులు నిర్ణయించినట్లు తెలిసింది.

మంగళూరుకు చెందిన ప్రతీక్‌శెట్టి అరెస్ట్‌ 
మంగళూరుకు చెందిన ప్రతీక్‌శెట్టికి ప్రముఖ డ్రగ్స్‌ పెడ్లర్‌గా పేరుంది. ఇతనిని శుక్రవారం సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేసి చామరాజపేటలోని సీసీబీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. తప్పించుకుని తిరుగుతున్న షేక్‌ ఫైజల్, ఆదిత్య ఆళ్వల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రతీక్‌శెట్టికి డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా ఉన్న నిశాన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఫైజల్‌ ఇంటిపై దాడి చేసి అతడి తమ్ముడిని విచారించిన సమయంలో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో ప్రతీక్‌శెట్టిని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. డ్రగ్స్‌ కేసులో ఫైజల్‌ పాత్ర అధికంగా ఉన్నట్లు గుర్తించిన సీసీబీ అతని కోసం గాలిస్తున్నారు.     ( డ్రగ్స్‌ కేసు; బయటపడిన కొత్త విషయం )

పది ఫ్లాట్సూ నావే  : సంజన 
నటి సంజనాను పోలీసులు శుక్రవారం కూడా సుదీర్ఘంగా విచారించారు. బెంగళూరు నగరంలో 10 ప్లాట్స్‌ ఉన్నట్లు అంగీకరించారు. ఫ్లాట్స్‌కు ఎవరెవరు వచ్చి వెళ్లారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కన్నడ సినీ రంగానికి చెందిన అనేక మంది నటులు, సంగీత దర్శకులు వచ్చి వెళ్లినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో సంజనా ఫ్లాట్‌కు వెళ్లిన సినిమా రంగానికి చెందిన ప్రముఖులు న్యాయ సలహాలను తీసుకుంటున్నట్లు సమాచారం. కేసు నుండి తప్పించుకోవటానికి రాజకీయ నాయకులు, వ్యాపారులు, శ్రీమంతుల పుత్రులు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.    

రాగిణి బెయిల్‌ పిటిషన్‌ వాయిదా 
బెయిల్‌ కోసం నటి రాగిణి 33వ సీసీహెచ్‌ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ ఈ నెల 14కు వాయిదా వేసింది. రాగిణి పోలీసు కస్టడీ అవధి శుక్రవారంతో ముగియటంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జడ్జి ముందు హాజరు పరిచారు. మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని సీసీబీ పోలీసులు పేర్కొనడంతో పోలీస్‌ కస్టడీని 14 వరకు పొడిగించింది. మరో నిందితురాలు సంజనాను కూడా శుక్రవారం కోర్టు ముందు హాజరు పరిచి కస్టడీకి తీసుకున్నారు.  

క్యాసినోలో మాజీ ఎమ్మెల్సీ 
శ్రీలంకలోని క్యాసినోలో బెంగళూరుకు చెందిన మాజీ ఎంఎల్‌సీ ఒకరు పాల్గొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరో ముగ్గురు ప్రముఖ నటులు కూడా క్యాసినోలో పాల్గొన్నట్లు సీసీబీ సమాచారం సేకరించింది.  

ప్రశాంత్‌ సంబరగిపై కేసు నమోదు 
సామాజిక కార్యకర్త ప్రశాంత సంబరగిపై పోలీసులు సెక్షన్‌ ఐపీసీ 120బి, 504 సెక్షన్లు కింద ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఇదిలా ఉండగా డ్రగ్స్‌ కేసులో చామ­రాజ­పేట ఎమ్మెల్యే జమీర్‌ఖాన్‌ ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో జమీర్‌ తరఫు న్యాయవాది  చామరాజపేట పోలీసులకు  వివరణ ఇచ్చారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా