Tamilnadu: నగల కోసం కరోనా రోగి హత్య 

16 Jun, 2021 13:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 జీహెచ్‌లో పారిశుద్ధ్య కార్మికురాలి నిర్వాకం

అరెస్టు చేసిన పోలీసులు

సాక్షి, చెన్నై: నగలు, సెల్‌ఫోన్‌ కోసం జీహెచ్‌లో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికురాలు కరోనా రోగిని హత్య చేసింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలు.. వెస్ట్‌ తాంబరానికి చెందిన ప్రొఫెసర్‌ మౌళి భార్య సునీత గత నెల కరోనా బారిన పడ్డారు. ఆమెకు ఆక్సిజన్‌ శాతం తక్కువగా ఉండడంతో మే 23వ తేదీ చెన్నై రాజీవ్‌గాంధీ జీహెచ్‌కు తరలించారు. ఇంటికి వెళ్లిన ఆమె భర్త సైతం అనారోగ్యం బారిన పడ్డారు.

వారం రోజుల అనంతరం వచ్చి చూడగా, సునీత కనిపించడం లేదని సిబ్బంది సమాధానం ఇచ్చారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. వారం రోజుల అనంతరం ఆస్పత్రిలోని ఎనిమిదో అంతస్తులోని విద్యుత్‌ పరికరాల గది నుంచి దుర్వాసన రావడాన్ని సిబ్బంది గుర్తించారు. పరిశీలించగా కుళ్లిన స్థితిలో సునీత మృతదేహం బయట పడింది. పోస్టుమార్టం చేశారు. మూడో అంతస్తులో ఉన్న సునీత ఎనిమిదో అంతస్తుకు ఎలా వెళ్లారో..? అనే అనుమానం తలెత్తింది. 

సీసీ కెమెరా ఆధారంగా గుర్తింపు 
కేసును తీవ్రంగా పరిగణించిన ఉత్తర చెన్నై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళ పదేపదే సునీత బెడ్‌ వద్దకు వెళ్లిరావడం గమనించారు. తిరువళ్లూరుకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు రతీదేవిగా గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. సునీతను వీల్‌చైర్‌లో తీసుకెళ్లి గొంతునులిమి చంపినట్లు విచారణలో తేలింది. నగలు, సెల్‌ఫోన్‌ను అపహరించినట్లు సమాచారం.

చదవండి: కీచక బాబాకు సాయం.. మహిళా టీచర్లపై పోక్సో చట్టం 

మరిన్ని వార్తలు