Sanjay Gaikwad: ‘8 కోట్ల ఖరీదైన కారు.. ఇదేం ‘దొంగ’ బుద్ధి!’

14 Jul, 2021 12:05 IST|Sakshi
Courtesy: ఇండియాటుడే

విద్యుత్‌ చౌర్యం కేసులో శివనేత సేనపై ఫిర్యాదు

ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

ముంబై: శివసేన నేత, కళ్యాణ్‌కు చెందిన వ్యాపారవేత్త సంజయ్‌ గైక్వాడ్‌కు సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘‘ఖరీదైన కార్లలో తిరిగే మీకు.. ఇదేం దొంగ బుద్ధి.. సార్‌’’ అంటూ నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలంటూ హితవు పలుకుతున్నారు. అసలేం జరిగిందంటే.. సంజయ్‌ గైక్వాడ్‌ విద్యుత్‌ చౌర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎమ్‌ఎస్‌ఈడీసీఎల్‌) ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాల ప్రకారం.. తూర్పు కళ్యాణ్‌ ప్రాంతంలో గల కోక్సెవాడిలో ఉన్న గైక్వాడ్‌కు చెందిన కన్‌స్ట్రక్షన్‌ సైట్‌ వద్ద విద్యుత్‌ చైర్యం గురించి జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. 

దీంతో రూ. 34,840 బిల్లుతో పాటు 15 వేల జరిమానా విధిస్తున్నట్లు నోటీసులు పంపించారు. అయినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడంతో.. జూన్‌ 30న ఎమ్‌ఎస్‌ఈడీసీఎల్‌ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం(జూలై 12)న సంజయ్‌ గైక్వాడ్‌ పెనాల్టితో కలిసి మొత్తం 49,840 రూపాయలు చెల్లించారు. ఈ మేరకు విద్యుత్‌ సంస్థ సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. 

ఇక ఈ విషయంపై స్పందించిన శివసేన శ్రేణులు.. సంజయ్‌ గైక్వాడ్‌పై వచ్చిన ఆరోపణలు సరికావని, ఆయనకు విద్యుత్‌ చౌర్యంతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొనడం గమనార్హం. కాగా సంజయ్‌ గైక్వాడ్‌ ఇటీవలే సుమారు 8 కోట్ల రూపాయలు వెచ్చించి రోల్స్‌ రాయిస్‌ కారును సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కారు ఖరీదును ప్రస్తావిస్తూ నెటిజన్లు, రాజకీయ ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు