మర్డర్‌ కేసును ఛేదించిన పోలీసులు: పక్కా ప్లాన్‌తోనే హత్య చేశారు.. కారణం అదే!

9 Dec, 2021 09:46 IST|Sakshi

అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని హత్య  

ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

సత్తెనపల్లి: హత్య కేసును సత్తెనపల్లి పోలీసులు ఛేదించారు. కడప జిల్లా మైదుకూరుకు చెందిన యల్లంపల్లి చాంద్‌బాషా ట్రావెల్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. గత ఏడాది భార్య, బిడ్డలను వదిలేసి సత్తెనపల్లిలో ఉంటూ తాపీ పనులకు వెళ్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. ఈ క్రమంలో సత్తెనపల్లి పట్టణంలోని గుంటూరు మేస్త్రీ బజారులో నివసిస్తున్న పైర్థల నాగమల్లేశ్వరితో సహజీవనం చేస్తున్నాడు. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సహజీవనం చేస్తున్న చాంద్‌బాషాను అడ్డు తొలగించుకోవాలని నాగమల్లేశ్వరి పథకం పన్నింది. 

ఈ నేపథ్యంలో ఈ నెల 3న నాగమల్లేశ్వరితో పాటు రెంటచింతల గ్రామం దొమ్మరకాలనీకి చెందిన అన్నపురెడ్డి అమరయ్య అలియాస్‌ అమర్, సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లకు చెందిన తన్నీరు సుబ్బారావు ముగ్గురు కలిసి మద్యం సేవిద్దామని చాంద్‌బాషాను నమ్మించి పట్టణంలోని రైల్వే స్టేషన్‌ రోడ్డులో స్టేడియంలోకి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి చాంద్‌బాషాను గొంతునొక్కి, గుండెలపై, వీపుపై గుద్ది హతమార్చారు. ఈ నెల 4న చాంద్‌బాషా మృతదేహాన్ని స్థానికులు చూసి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చాంద్‌బాషాను హత్య చేసినట్లు గ్రహించిన పోలీసులు సత్తెనపల్లి డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి పర్యవేక్షణలో పట్టణ సీఐ యు.శోభన్‌బాబు నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు ప్రారంభించింది. 

నాగమల్లేశ్వరి పథకం ప్రకారం మరో ఇద్దరితో కలిసి హతమార్చినట్లుగా తేలడంతో ముగ్గురి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో నాగమల్లేశ్వరి ఇల్లు వదిలి వెళ్లిపోవడం, మిగిలిన ఇద్దరు కూడా కనిపించకపోవడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 7న నాగమల్లేశ్వరి, అమరయ్యను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి పట్టణ పోలీసు స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో నిందితుల వివరాలను సీఐ శోభన్‌ బాబు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. ఈ హత్య కేసు ఛేదించడంలో సహకరించిన ఎస్‌ఐ  రఘుపతిరావు, హెడ్‌ కానిస్టేబుళ్లు ఎం.గంగాధరరావు, కె.రామారావు, కానిస్టేబుళ్లను డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, సీఐ శోభన్‌బాబు అభినందించారు.

చదవండి: పట్ట‘పగ’లు మాజీ సర్పంచ్‌ దారుణ హత్య

మరిన్ని వార్తలు