ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజర్‌ ఆత్మహత్య

23 Mar, 2021 08:28 IST|Sakshi
వెంకన్న (ఫైల్‌)

బ్యాంకు అధికారుల వేధింపులే కారణమని మృతుడి భార్య ఫిర్యాదు

ముస్తాబాద్‌లో ఘటన

సాక్షి, ముస్తాబాద్‌(సిరిసిల్ల): ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ముస్తాబాద్‌ ఎస్సై లక్ష్మారెడ్డి కథనం ప్రకారం.. కమలాపూర్‌ మండలంలోని మాదన్నపేటకు చెందిన మాచర్ల వెంకన్న(37) ముస్తాబాద్‌లోని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పోత్గల్‌ బ్రాంచిలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. 15 రోజులు సెలవులో వెళ్లిన ఆయన శనివారం తిరిగి విధుల్లో చేరారు. సోమవారం ఉదయం బ్యాంకు సమయం దాటినా రాకపోవడంతో అధికారులు, సిబ్బంది వెంకన్న అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లగా అచేతనంగా పడివున్నారు.

పురుగుల మందు తాగినట్లు గుర్తించి, స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో సిద్దిపేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. సంఘటన స్థలాన్ని ఎస్సై లక్ష్మారెడ్డి పరిశీలించారు. అయితే బ్యాంక్‌ అధికారుల వేధింపుల వల్లే తన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని వెంకన్న భార్య పద్మ ఆరోపించారు. దీనికి కారణమైన వారిని చట్టరీత్యా శిక్షించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి కుమారుడు సాయితేజ, కూతురు దీక్షిత ఉన్నారు. వెంకన్న మృతితో బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
చదవండి: ప్రాణం తీసిన పంచాయితీ తీర్పు 

మరిన్ని వార్తలు