ఎస్‌బీఐ ఉద్యోగుల నిర్వాకం..కస్టమర్ల బంగారం తాకట్టు

3 Feb, 2021 10:26 IST|Sakshi

రూ. 3 కోట్లు చెల్లిస్తామని బేరాలు? 

సఖినేటిపల్లి ఎస్‌బీఐ రుణాలపై అధికారుల విచారణ 

మలికిపురం/తూర్పు గోదావరి: ఖాతాదారులకు భద్రత కలి్పంచాల్సిన వారే అక్రమాలకు ఊతమిచ్చారు.. చివరికి చిక్కారు.. ఇప్పుడేమో తమ తప్పు కప్పిపుచ్చుకునేందుకు బేరసారాలకు దిగారు.. గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతు జరుగుతున్నట్లు సమాచారం. చివరికి ఏం జరుగుతుందో చూడాల్సిందే. సఖినేటిపల్లి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లో ఖాతాదారులు కుదవ పెట్టిన బంగారు ఆభరణాలను ఆ బ్యాంకు ఉద్యోగులే మరోసారి అక్రమంగా తాకట్టు పెట్టిన వ్యవహారంపై ఉన్నతాధికారుల విచారణ కొనసాగుతోంది. వారం రోజులుగా ఈ పనిలోనే వారున్నారు. ఇప్పటి వరకూ ఎంత మేరకు అక్రమంగా రుణాలు పొందారనే విషయమై ఇంకా ఓ కొలిక్కి రాలేకపోతున్నారు. దీనిపై హైదరాబాద్‌ కేంద్రంగా అధికారులు ఖాతాదారులకు నేరుగా ఫోన్లు చేసి బంగారంపై ఎంత మేరకు రుణాలు తీసుకున్నారనే వివరాలు సేకరిస్తున్నారు.

తమ బ్యాంకులో లోన్‌ గడువు ముగిసినట్లు సమాచారం ఉంటే రుణాలను రీ షెడ్యూల్‌ చేసుకోవాలని కూడా సూచించారు. దీనివల్ల ఖాతాదారులు ఎంతమేరకు రుణాలు తీసుకున్నారనే సమాచారం తెలుస్తోంది. ఇప్పటి వరకూ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రూ. 6.5 కోట్ల నగదు ఈ వ్యవహారంలో బ్యాంకు ఇంటి దొంగలు అక్రమంగా కాజేశారని తెలియవచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ముగ్గురు ఉద్యోగులను సస్పండ్‌ చేశారు. ఇందులో ఓ ప్రధాన సూత్రధారి తొలి విడత రూ. మూడు కోట్లు చెల్లిస్తానని ఉన్నతాధికారులకు రాయబారం పంపినట్లు సమాచారం. సదరు నిందితులు రొయ్యల చెరువులు, రియల్‌ ఎస్టేట్‌లలో పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు. ఇంటి దొంగలే కావడంతో అసలు ఈ వ్యవహారం బయటకు వస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో బ్యాంకులో బంగారం కుదువ పెట్టిన వారితో పాటు నగదు దాచుకున్న ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ కుంభకోణాన్ని సీబీఐ లేదా, సీఐడీలకు అప్పగించే యోచనలో బ్యాంకు ఉన్నతాధికారులు ఉన్నట్లు మరి కొందరు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు