డబ్బులు తిరిగిచ్చేయమని అడిగితే న్యాయవాది అని బెదిరించారు 

27 Jul, 2021 08:18 IST|Sakshi

పీడీ యాక్టు కేసులో తెలంగాణ ప్రభుత్వం 

తీర్పు రిజర్వు చేసిన సుప్రీంకోర్టు 

సాక్షి,న్యూఢిల్లీ: ఒకటి కంటే ఎక్కువ నేరాల్లో నేరస్తుడు కావడంతోపాటు న్యాయవాదినని పలువురిని బెదిరించడంతోనే పిటిషనర్‌ భర్తను మళ్లీ అరెస్టు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తన భర్తను పోలీసులు పీడీ యాక్టు కింద అరెస్టు చేయడాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్‌ చేస్తూ బంక స్నేహశీల దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ రోహింటన్‌ ఫాలీ నారీమన్, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 

పిటిషనర్‌ తరఫు న్యాయవాది గౌరవ్‌ అగర్వాల్‌ వాదనలు వినిపిస్తూ.. మార్చిలో బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ ఎలాంటి ఫిర్యాదు రాకపోయినా సెప్టెంబరులో మళ్లీ అరెస్టు చేశారని తెలిపారు. పబ్లిక్‌ ఆర్డర్‌ ఉల్లంఘన, శాంతి భద్రతల ఉల్లంఘన లేకపోయినా పీడీ యాక్టు కింద అరెస్టు చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. వంద శాతం సొమ్ములు తిరిగి ఇచ్చేస్తామని చిన్నచిన్న వ్యాపారస్తులను మోసం చేశారని ఆరోపించారు. 

ఎవరైనా సొమ్ములు ఖాతాలో జమచేస్తే వెంటనే తన భార్య ఖాతాకు వాటిని మళ్లించేవారని దీనికి ఆధారాలు ఉన్నాయని రంజిత్‌కుమార్‌ తెలిపారు. లాభాలు ఇస్తానని హామీనిచ్చి ఎవరైనా సొమ్ములు అడిగితే తాను హైకోర్టు న్యాయవాదినంటూ బెదిరించేవారన్నారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు జోక్యం అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

మరిన్ని వార్తలు