యువరాజ్‌ సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

15 Feb, 2021 12:35 IST|Sakshi

గతేడాది ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు

క్షమాపణలు కోరినప్పటకి ముగిసిపోని వివాదం

చండీగఢ్‌: భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. గతేడాది జూన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ వీడియో సందర్భంగా యువరాజ్‌ సింగ్‌.. తోటి క్రికెటర్‌ యజువేంద్ర చహల్‌ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హరియాణాకు చెందిన ఓ లాయర్‌ హిస్సార్‌ పరిధిలోని హాన్సీ పోలీసు స్టేషన్‌లో యువరాజ్‌పై పిర్యాదు చేశారు. ఆయనపై భారతీయ శిక్షాస్మృతిలోని 153, 153 ఏ, 295, 505 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ లోని 3 (1) (ఆర్), 3 (1) ఎస్) కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే.. గత సంవత్సరం జూన్‌లో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఓ లైవ్ సెషన్‌లో పాల్గొన్నన్నారు యువరాజ్‌ సింగ్‌. ఈ క్రమంలో తోటి ఆటగాడైన ‌ యజువేంద్ర చహల్ను ఉద్దేశించి మాట్లాడాడు యువరాజ్‌ సింగ్‌. ఆ సమయంలో యజువేంద్ర చహల్‌ సామాజిక వర్గాన్ని ప్రసావిస్తూ.. కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో యువరాజ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ వివాదంపై స్పందించిన యువరాజ్‌.. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, తన మాటలు ఎవరినైనా నొప్పించినా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరుతూ అప్పట్లోనే ట్వీట్‌ చేశారు. 

అయితే ఈ వివాదం అంతటితో ముగిసిపోలేదు. యువరాజ్ చేసిన వ్యాఖ్యలు కుల అహంకారాన్ని సూచిస్తున్నాయని, నిమ్న కులాలను లక్ష్యంగా చేసుకుని ఆయన మాట్లాడారని ఆరోపిస్తూ  ఓ న్యాయవాది పోలీసులను ఆశ్రయించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై లాక్‌డౌన్‌ అనంతరం విచారణ జరిపి, వీడియో ఫుటేజ్‌లను పరిశీలించిన హిస్సార్ పోలీసులు.. ప్రస్తుతం యువరాజ్‌పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయడం గమనార్హం. త్వరలోనే యువరాజ్‌కు నోటీసులు పంపి ఆయనను విచారిస్తామని ఓ అధికారి వెల్లడించారు.

చదవండి: యువీకి సరికొత్త తలనొప్పి
              'నా తం‍డ్రి వ్యాఖ్యలు నన్ను బాధించాయి'

మరిన్ని వార్తలు