న్యాయవాద దంపతుల హత్యపై సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌

4 Mar, 2021 03:05 IST|Sakshi

న్యాయవాద దంపతుల హత్యపై సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌

బిట్టు శ్రీను నుంచి నిజాలు రాబట్టే పనిలో పోలీసులు

పోలీసు కస్టడీలోనే నిందితులు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. రామగుండం డీసీపీ (అడ్మిన్‌) ఎన్‌.అశోక్‌కుమార్‌ ఆ«ధ్వర్యంలో బుధవారం నిందితులతో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయించారు. పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు నుంచి వామన్‌రావు దంపతులు బయలుదేరిన సమయంలో నిందితులు ఎక్కడ ఉన్నారు..? ఎలా వెళ్లారు..? మంథని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని పూలే విగ్రహం, కోర్టు, ప్రధాన చౌరస్తా, పాత పెట్రోల్‌ బంక్‌ ప్రాంతాల్లో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. అనంతరం ముగ్గురు నిందితులను రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లారు. హత్యకు పాల్పడిన రోజు వాహనాలను ఎక్కడ నిలిపివేశారు.. న్యాయవాద దంపతుల వాహనాన్ని ఎక్కడ దాట వేశారు.. తెలంగాణ చౌరస్తా వద్ద వాహనాలు ప్రయాణించిన తీరును పరిశీలించారు.

కాల్‌డేటా విశ్లేషణ
హత్య జరిగిన రోజు నిందితులు కుంట శ్రీను, చిరంజీవి, అక్కపాక కుమార్, బిట్టు శ్రీను సెల్‌ఫోన్‌ల నుంచి ఎవరెవరికి కాల్స్‌ వెళ్లాయనే విషయంపై కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు. వారి నుంచి కాల్‌ వచ్చిన ప్రతి ఒక్కరినీ రామగుండం కమిషనరేట్‌కు పిలిపించుకుని వాళ్ల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకుంటున్నారు. వారు ఎందుకు కాల్‌ చేశారు..ఈ హత్యలతో ఇతరులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. దీంతో సాధారణంగా నిందితుల నుంచి కాల్స్‌ వచ్చిన వారంతా బెంబేలెత్తిపోతున్నారు. ఈ కేసు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, పోలీసు కస్టడీలోకి తీసుకున్న ముగ్గురు ప్రధాన నిందితుల సమయం గురువారంతో ముగియనుంది.

బిట్టు నోరు మెదిపేనా..! 
జంట హత్యలకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు మేనల్లుడు తుల్సెగారి శ్రీనివాస్‌ ఉరఫ్‌ బిట్టు శ్రీను నోరు తెరిస్తే మరిన్ని నిజాలు వెల్లడి కానున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం రూ.30 వేల ఆదాయం కోల్పోయాననే కక్షతో ఈ దారుణానికి పూనుకున్నారా..? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో పలు కథనాలు వైరల్‌ అవుతుండటంతో ఆ దిశగా పోలీసులు దృష్టి సారిస్తున్నారు.
ఐదో నిందితుడి అరెస్టులో జాప్యం
న్యాయవాద దంపతులు కోర్టు నుంచి బయలు దేరే సమాచారం ఐదో నిందితుడు లచ్చయ్య ఇచ్చినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే.. ఇతడిని అదుపులోకి తీసుకొని వారం గడిచినా అరెస్టు చూపించడంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.   

మరిన్ని వార్తలు