ప్రాణం తీసిన ఈత సరదా..

15 Jul, 2021 09:00 IST|Sakshi

సాక్షి,బేతంచెర్ల: స్నేహితులతో సరదాగా ఈతకెళ్లిన ఓ విద్యార్థి మృత్యువాతపడ్డాడు. మండల పరిధిలోని బలపాలపల్లె గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు..  పెద్దనాగి గాల్ల చిన్న మద్దయ్య, దస్తగిరమ్మ  దంపతులకు నలుగురు సంతానం. మూడో వాడైన నరసింహ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు.

బుధవారం తోటి మిత్రులతో కలిసి హెచ్‌. కొట్టాల గ్రామ సమీపాన ఉన్న పొలం నీటి తొట్టిలో ఈతకొట్టేందుకు వెళ్లారు. నరసింహకు సరిగా ఈత రాకపోవడంతో తొట్టిలోని నీటిలో మునిగిపోయాడు. మిత్రుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని  నరసింహను బయటకు తీసి హుటాహుటిన బేతంచెర్ల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించడంతో తల్లిదండ్రులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

బాలుడిని మింగేసిన నీటి బకెట్‌  
సి.బెళగల్‌: బుడిబుడి అడుగులతో సందడి చేసిన చిన్నారి అంతలోనే అనంతలోకాలకు చేరుకున్నాడు. ఇంటి వద్ద ఉన్న నీటి బకెట్‌ మృత్యుపాశమై ప్రాణాలు తీసింది. ఈ విషాదకర  ఘటన సి.బెళగల్‌ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న రాజు, ఇందిరలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె  సంతానం. భర్త రాజు బుధవారం తన పనులు ముగించుకుని ఇంట్లో నిద్రిస్తుండగా, భార్య దుస్తులను శుభ్రపరిచేందుకు బకెట్‌లో నీటిని నింపింది.

అయితే ఒంట్లో కాస్త నలతగా ఉండటంతో ఆమె కూడా ఇంట్లో నిద్రించింది. కాగా రోజులాగానే ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్న కుమారుడు ప్రియానంద్‌ (2) మధ్యాహ్న సమయంలో నీటి బకెట్‌లో తలక్రిందులుగా పడి   మృతి చెందాడు. నిద్రలేచిన తల్లిదండ్రులు నీటి బకెట్‌లో పడి ఉన్న కుమారుడిని చూసి వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలపటంతో బోరున విలపించారు. వారి రోదనలు పలువురిని  కంటతడి పెట్టించాయి. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు