టీచర్‌ కాదు.. టీచకుడు

16 Dec, 2020 08:02 IST|Sakshi
గ్రామస్తులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ భద్రకాళి

ఐదుగురు విద్యార్థినులపై హెచ్‌ఎం లైంగికదాడి

సాక్షి, కొత్తగూడెం ‌: చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే కీచకుడిగా మారాడు. స్కూళ్లు తెరవకున్నా క్లాసులు చెబుతానంటూ తీసుకొచ్చి మరీ విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వివరాలు మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామపంచాయతీ పరిధిలోని చింతవర్రెలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో ఐదుగురు బాలికలున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దొడ్డే సునీల్‌కుమార్‌ వీరిపై కొద్దిరోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరిౖకైనా చెబితే చంపేస్తానని చిన్నారులను బెదిరించాడు. దీంతో భయపడ్డ వారు మిన్నకుండి పోయారు. చదవండి: పరువు పోయిందని.. ప్రాణం తీసుకుంది

ఈ క్రమంలోనే లైంగికదాడి కారణంగా ఓ విద్యార్థిని ఆస్పత్రి పాలైంది. ఈ విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియగా.. మిగిలిన విద్యార్థినుల తల్లిదండ్రులతో కలసి ఆ హెచ్‌ఎంను నిలదీశారు. గత రెండ్రోజులుగా ఈ విషయంపై మరో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించాడు. అది కాస్త బయటకు పొక్కడంతో గ్రామస్తులందరూ ఉపాధ్యాయుడిని మంగళవారం నిలదీసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, తహసీల్దార్‌ భద్రకాళి, ఎంపీడీఓ రామారావు, సీడీపీఓ కనకదుర్గ, సీఐ గురుస్వామి, ఎస్సై అంజయ్య, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి ఆ చిన్నారులతో మాట్లాడారు. గ్రామస్తులు, తల్లిదండ్రులతో విషయంపై చర్చించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే డీఈఓ సోమశేఖరశర్మ.. సునీల్‌కుమార్‌ను సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించారు. దీనిపై స్థానిక ఎస్సై అంజయ్యను వివరణ కోరగా.. ఆస్పత్రిలో చేరిన విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు