-

ఆ బాడీ దొరికితేనే సంచలన కేసు కొలిక్కి: కృష్ణానదిలో గాలింపు ముమ్మరం

11 Aug, 2021 08:22 IST|Sakshi

హత్య కేసులో ఆధారాల కోసం అన్వేషణ

ఆనంద్‌ మృతదేహం కోసం కృష్ణానదిలో గాలింపు

5 గంటలు వెతికినా కనిపించని ప్రయోజనం

తాడేపల్లి రూరల్‌ (గుంటూరు జిల్లా): సంచలనం రేపిన సీతానగరం అత్యాచారం ఘటనకు ముందు హత్యకు గురైన ఆనంద్‌ మృతదేహం కోసం తాడేపల్లి పోలీసులు కృష్ణానదిలో అన్వేషణ ప్రారంభించారు. అత్యాచారంతో పాటు ఓ వ్యక్తిని హత్య చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. అత్యాచారానికి గురైన యువతి, ఆమె స్నేహితుడి సెల్‌ఫోన్లతో పాటు హత్యకు గురైన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన ఆనంద్‌ సెల్‌ఫోన్‌ కూడా నిందితులు షేర్‌ కృష్ణ, షేక్‌ హబీబ్‌ వద్ద లభించాయి.

జూన్‌ 22వ తేదీ ఆనంద్‌ భార్య మృదుల తన భర్త కనిపించడం లేదని, చివరిసారిగా కృష్ణానది రైల్వే బ్రిడ్జి మీద ఉంచి ఫోన్‌ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై పోలీసులు జూన్‌ 23వ తేదీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో హత్యకు గురైంది మిస్సింగ్‌ కేసులో ఆనంద్‌ అని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు మంగళవారం ఆనంద్‌ మృతదేహం కోసం కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. షేర్‌ కృష్ణ, ప్రసన్నరెడ్డి అలియాస్‌ వెంకటరెడ్డి, షేక్‌ హబీబ్‌ ముగ్గురూ కలిసి అత్యాచారం చేసేముందు దొంగతనం చేయడం, దానిని ఆనంద్‌ చూడటం, ఆనంద్‌ దగ్గర ఉన్న డబ్బులు లాక్కుని అతడ్ని కొట్టి, హత్యచేసి ఆ మృతదేహాన్ని ఓ ఐరన్‌ గిడ్డర్‌కు కట్టి కృష్ణానదిలో పడవేశారు. షేర్‌ కృష్ణ, హబీబ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయగా, విచారణలో మృతదేహాన్ని ఎక్కడ పడవేశాడో నిందితులు పోలీసులకు చూపించారు. దీంతో మృతదేహం కోసం పోలీసులు ఆ ప్రాంతంలో గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు నిర్వహించారు.

ఆరుగురు గజ ఈతగాళ్లు ఐదు గంటల పాటు ఆనంద్‌ మృతదేహం కోసం  విస్తృతంగా నీటిలో గాలించినా ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. జూన్‌ 19వ తేదీ ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి కృష్ణా నదిలోకి రెండుసార్లు 5 లక్షల క్యూసెక్కులపైన వరద నీరు రావడం, ఆ నీటితో పాటు ఇసుక కూడా కొట్టుకువచ్చిందని, మృతదేహం ఎక్కడో ఇసుకలో కూరుకుపోయి ఉంటుందని గజ ఈతగాళ్లు చెబుతున్నారు. కృష్ణానదిలో పూర్తిగా నీళ్లు తగ్గితేనే కూరుకుపోయిన మృతదేహాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. వరద ఉధృతికి కొట్టుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయని గజ ఈతగాళ్లు పేర్కొన్నారు. పోలీసులు గజ ఈతగాళ్లతో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో ఆనంద్‌ మృతదేహం కోసం గా>లించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు