తూర్పుగోదావరిలో ఎస్‌ఈబీ మెగా ఆపరేషన్‌

28 Apr, 2021 04:37 IST|Sakshi
ఎస్‌ఈబీ బృందాల దాడుల్లో సారా ధ్వంసం

ఒకే రోజున 13 బృందాలతో సారా స్థావరాలపై దాడులు 

67,900 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం.. 5గురు అరెస్టు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధిక నాటుసారా తయారీ కేంద్రాలు ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించినట్టు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి ఆధ్వర్యంలో ఎస్‌ఈబీ ఏఎస్పీ సుమిత్‌ గరుడ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ ప్రసాద్‌ల పర్యవేక్షణలో 100 మంది సిబ్బంది 13 టీమ్‌లుగా ఏర్పడి సారా తయారీ కేంద్రాలపై పెద్ద ఎత్తున దాడులు చేశారు.

మంగళవారం ఒక్క రోజే జిల్లాలోని 30 వేర్వేరు ప్రాంతాల్లో  సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 67,900 లీటర్ల (రూ.13 లక్షల విలువైన) బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఇంత పెద్ద ఎత్తున బెల్లం ఊటను ధ్వంసం చేయడం ఆంధ్రప్రదేశ్‌లోనే రికార్డు. 5గురిని అరెస్టు చేశారు. 100 లీటర్ల నాటు సారాను, ఒక వాహనాన్ని స్వాదీనం చేసుకున్నారు. సారా తయారీకి సంబంధించిన సమాచారాన్ని తూర్పుగోదావరి ఎస్‌ఈబీ హెల్ప్‌లైన్‌ నంబర్‌ +91 9490618510కు ఫోన్‌ చేసి తెలియజేయాలని వినీత్‌ బ్రిజ్‌లాల్‌ సూచించారు.  

మరిన్ని వార్తలు