Secunderabad Fire Tragedy: బ్యాటరీ పేలుడు వల్లే.. 

14 Sep, 2022 01:50 IST|Sakshi
రూబీ ఎలక్ట్రికల్‌ స్కూటర్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయిన మోటార్‌ సైకిళ్లు 

సికింద్రాబాద్‌ అగ్నిప్రమాద ఘటనపై పోలీసుల ప్రాథమిక నిర్ధారణ 

లాడ్జి సెల్లార్‌లో అక్రమంగా ఈ–స్కూటర్స్‌ షోరూం, సర్వీసింగ్‌ సెంటర్‌ 

చార్జింగ్‌ పెట్టిన ఈ–స్కూటర్‌ బ్యాటరీ నుంచి వెలువడిన మంటలు 

మెట్ల మార్గం ద్వారా లాడ్జీలోకి వ్యాపించిన దట్టమైన పొగలు 

ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య.. పోలీసుల అదుపులో లాడ్జి నిర్వాహకులు 

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని రూబీ ఎలక్ట్రికల్‌ స్కూటర్స్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదానికి ఈ–స్కూటర్‌ బ్యాటరీ పేలడమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదం కారణంగా వెలువడిన దట్టమైన పొగ ప్రభావంతోనే లాడ్జీలో బస చేసిన వాళ్లు చనిపోయినట్లు తేల్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో క్షతగాత్రుడు మంగళవారం మృతిచెందాడు.

దీంతో ఈ దుర్ఘటనలో కన్నుమూసిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన హోటల్, విద్యుత్‌ ద్విచక్ర వాహనాల షోరూమ్‌ నిర్వహిస్తున్న రాజేందర్‌సింగ్‌ బగ్గా, సుమిత్‌ సింగ్‌లతోపాటు మరికొందరిపై మార్కెట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని మంగళవారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 


సెల్లార్‌ నుంచి గ్రౌండ్‌ ఫ్లోర్‌ వరకు.. 

హైదరాబాద్‌లోని కార్ఖానా ప్రాంతానికి చెందిన రాజేంద్రసింగ్‌ బగ్గా, సుమీత్‌సింగ్‌ కొన్నేళ్లుగా సికింద్రాబాద్‌లోని సెయింట్‌ మేరీస్‌ రోడ్డులో రూబీ ప్రైడ్‌ లగ్జరీ హోటల్‌ పేరుతో లాడ్జి నిర్వహిస్తున్నారు. అలాగే రెండేళ్ల క్రితం ఈ–స్కూటర్స్, బైక్స్‌ వ్యాపారంలోకి దిగారు. ఓ సంస్థకు చెందిన ఈ–స్కూటర్స్‌ డీలర్‌షిప్‌ తీసుకొని షోరూం, సర్వీసింగ్‌ సెంటర్లను లాడ్జి గ్రౌండ్‌ఫ్లోర్, సెల్లార్‌లో అక్రమంగా ఏర్పాటు చేశారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రిసెప్షన్, ఈ–స్కూటర్స్‌ కార్యాలయం, మొదటి అంతస్తు నుంచి నాలుగో అంతస్తు వరకు మొత్తం 28 గదులు ఉన్నాయి. ఐదో అంతస్తులోని పెంట్‌ హౌస్‌లో రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నారు. 

చార్జింగ్‌ పెట్టిన బ్యాటరీ పేలడంతో... 
సోమవారం రాత్రి 9:17 గంటలకు సెల్లార్‌లోని ఈ–స్కూటర్స్‌ సర్వీసింగ్‌ పాయింట్‌లో చార్జింగ్‌ పెట్టి ఉంచిన ఈ–స్కూటర్‌ బ్యాటరీ పేలడంతో మంటలు అంటుకున్నాయి. ఇవి మిగతా వాహనాలకు, నిల్వఉంచిన టైర్లు, ప్లాస్టిక్, రబ్బర్‌ వస్తువులకు అంటుకోవడంతో మంటలతోపాటు దట్టమైన పొగ, విషవాయువులు వె లువడ్డాయి. ఆ సమయంలో లాడ్జీలో 25 మంది అతిథులు, 8 మంది ఉద్యోగులు ఉన్నారు.  

మెట్లమార్గం సెల్లార్‌ వరకు ఉండటంతో... 
ఈ భవనాన్ని సరైన వెంటిలేషన్‌ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడం, ఐదో అంతస్తు నుంచి సెల్లార్‌ వరకు నిర్మించిన మెట్ల మార్గం మీటర్‌ కంటే తక్కువ వెడల్పుతో ఇరుకుగా ఉండటంతో ప్రమాద సమయంలో అదే చిమ్నీ గొట్టంలాగా మారిపోయింది. సెల్లార్‌ నుంచి విషవాయువులు, నల్లటి పొగ దీని ద్వారానే లాడ్జి మొత్తం వ్యాపించాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో స్టెయిర్‌ కేస్‌కు, రిసెప్షన్‌కు మధ్య తలుపు మూసి ఉండటంతో పొగ బయటకు వచ్చే అవకాశం లేకపోయింది.

పొగను గమనించిన సిబ్బంది బయటకు పరుగులు తీయగా మొదటి, రెండో అంతస్తుల్లో బస చేసిన వారిలో నలుగురు గదుల్లోనే, మరో ముగ్గురు మెట్ల మార్గంలో ప్రాణాలు విడిచారు. మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. మూడు, నాలుగో అంతస్తుల్లో బస చేసిన కొందరిని స్థానికులు, పోలీసులు.. అగ్నిమాపక  అధికారులు కాపాడారు. పెంట్‌హౌస్‌లోని రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న నలుగురు పక్క భవనం టెర్రస్‌పైకి చేరుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. భవనానికి స్ప్రింక్లింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసినా సెల్లార్‌లో అది పనిచేసిన ఆనవాళ్లు కనిపించలేదు. విషవాయువులు పీల్చడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు వివరించారు. 


మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున పరిహారం 

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదానికి బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మహమూద్‌ అలీ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ రూ.3 లక్షల నష్టపరిహారం ప్రకటించారని హోం మంత్రి తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత దట్టమైన పొగ వ్యాపించడంతో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఘటనపై పోలీస్, అగ్నిమాపక శాఖలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయని, అన్ని కోణాలలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించామని హోం మంత్రి వెల్లడించారు.  

కేంద్రం రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా 
సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్‌ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రధాని కార్యాలయం మంగళవారం ట్వీట్‌ చేసింది. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..)

మరిన్ని వార్తలు