అప్పు తీసుకోలేదు.. కానీ కట్టాలని మెసేజ్‌..చివరికి

23 Apr, 2021 08:51 IST|Sakshi

ప్రమేయం లేకుండానే బ్యాంకు రుణం  

రూ.4.9 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు 

బాధితుడికి చెందిన రూ.25 వేలు కూడా..  

కేసు నమోదు చేసిన సిటీ క్రైమ్‌ పోలీసులు  

సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ ఉద్యోగిని సైబర్‌ నేరగాళ్లు నిండా ముంచారు. ఆయన ప్రమేయం లేకుండానే ఓ బ్యాంక్‌ నుంచి రూ.4.9 లక్షలు రుణం తీసుకున్నారు. ఈ మొత్తం బాధితుడి ఖాతాలో పడిన వెంటనే దాంతో పాటు  ఆ అకౌంట్‌లో ఉన్న మరో రూ.25 వేలు కాజేశారు. దీనిపై బాధితుడు గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

బాధితుడు రాజేష్‌కు ఓ రోజు హఠాత్తుగా ఆయన ఖాతాలో రూ.4.9 లక్షలు క్రెడిట్‌ అయినట్లు ఫోన్‌కు సందేశం వచ్చింది. దీనిపై ఆరా తీయగా ఓ బ్యాంకులో ఈయన పేరుతో వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసినట్లు, మంజూరైన మొత్తం ఖాతాలో పడినట్లు తెలిసింది. ఇది జరిగిన కొద్దిసేపటికే ఆ మొత్తంతో పాటు అందులో ఉండాల్సిన రూ.25 వేలు కూడా మరో ఖాతాకు బదిలీ అయిపోయాయి. దీనిపై రాజేష్‌కు స్పష్టత రాకుండానే బ్యాంకు నుంచి వాయిదాల చెల్లింపు కోరుతూ ఫోన్లు మొదలయ్యాయి. తాను అసలు రుణమే తీసుకోలేదని, ఆ మొత్తంతో  పాటు తన ఖాతాలోనివీ మాయమయ్యాయంటూ చెప్పినా బ్యాంకు సిబ్బంది పట్టించుకోలేదు. మీ పేరు, వివరాలతో దరఖాస్తు చేస్తేనే రుణం మంజూరు చేశామని, ఎట్టి పరిస్థితుల్లో వడ్డీ, పెనాల్టీలు కట్టాలని స్పష్టం చేశారు. దీంతో బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ అంశంపై ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆధారాలను బట్టి బాధితుడి ఫోన్‌కు మాల్‌వేర్‌ పంపడం ద్వారా సైబర్‌ నేరగాళ్లు తమ అధీనంలోకి తీసుకుని ఉంటారని భావిస్తున్నామన్నారు. దర్యాప్తులో భాగంగా బ్యాంకు నుంచి పూర్తి వివరాలు కోరతామని, ఆ తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. 

( చదవండి: జల్సాలకు అలవాటు పడి కన్నకొడుకునే! 

మరిన్ని వార్తలు