రైల్వే స్టేషన్‌ విధ్వంసం కేసులో.. ఏ1గా మధుసూదన్‌ 

21 Jun, 2022 00:55 IST|Sakshi

రిమాండ్‌ రిపోర్టులో నిందితులుగా 56 మంది 

కుట్ర జరిగినట్లు నిర్ధారణ.. రిపోర్ట్‌లో ఆ సెక్షన్‌ జోడించిన పోలీసులు  

13 మంది పరారీలో ఉన్నట్లు కోర్టు దృష్టికి..

కనిపించని ఆవుల సుబ్బారావు పేరు 

పరోక్షంగా ఆధారాలు అందించిన నిందితులు 

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసం కేసులో 45 మందిని అరెస్టు చేసిన పోలీసులు యల్లారెడ్డికి చెందిన స్పోర్ట్స్‌ పర్సన్‌ మలవెల్లి మధుసూదన్‌ను ఏ1 గా చూపించారు. ప్రస్తుతానికి ఇతడే ప్రధాన నిందితుడు అయినప్పటికీ.. దర్యాప్తులో వేరే వ్యక్తుల పాత్ర తేలే అవకాశం ఉందని చెపున్నారు. మధుసూదన్‌తో సహా అరెస్ట్‌చేసిన నిందితులను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి.. రిమాండ్‌ రిపోర్టును దాఖ లు చేశారు.

ఇందులో మొత్తం 56 మందిని ఇప్పటివరకు నిందితులుగా గుర్తించినట్లు సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు పేర్కొన్నారు. 13 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఐపీసీ, రైల్వే, ప్రజా ఆస్తుల విధ్వంసక నిరోధక చట్టాల్లోని 15 సెక్షన్ల కింద నిందితులపై ఆరో పణలున మోదుచేశారు. ప్రాథమిక దర్యాప్తులో కుట్రకోణం వెలుగులోకి రావడంతో ఆదివారం నాటి నిందితుల రిమాండ్‌ రిపోర్ట్‌లో ఆమేరకు ఐపీసీలోని 120బీ సెక్షన్‌ను జోడించారు. కాగా, మధుసూదన్‌ జాతీయ కబడ్డీ ఆటగాడు.

18 మంది ప్రత్యక్ష సాక్షులు 
ఈ కేసులో క్షతగాత్రులు సహా 18 మందిని ప్రత్యక్ష సాక్షులుగా చేర్చారు. నిందితులుగా ఉన్న 56 మందీ ఫిజికల్, మెడికల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సా«ధించి ఆర్మీ ఉద్యోగం కోసం ఎదు రుచూస్తున్న వారేనని పోలీసులు పేర్కొన్నా రు. కేంద్రం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్‌ నియా మక పథకానికి వ్యతిరేకంగా వాట్సాప్‌ గ్రూపు లు ఏర్పాటు చేశారని, ఇప్పటివరకు 8 గ్రూపులను గుర్తించామని, బిహార్‌లో జరిగిన అలర్ల వీడియోలను వీటిలో పోస్టు చేశారని రిపోర్టులో పేర్కొన్నారు.

ఏడు వాట్సాప్‌ గ్రూపుల అడ్మిన్లు పరారీలో ఉండగా.. ‘రైల్వేస్టేషన్‌ బ్లాక్‌’అడ్మిన్‌ రమేశ్‌ను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఈ గ్రూప్‌ ద్వారా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసానికి ప్లాన్‌ చేశారని, పలు ప్రైవేట్‌ డిఫెన్స్‌ అకాడమీలకు చెందిన నిర్వాహకులు, యజమానులు, డైరెక్టర్లు సహకరించారని పొందుపరిచారు. ఆస్తి, ఆత్మ రక్షణ కోసం పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారని బుల్లెట్‌ తగిలి రాకేష్‌ మరణించగా... మరో 12 మందికి గాయాలయ్యాయని రాశారు. ఈ రిపోర్ట్‌లో ఎక్కడా ఏపీలోని నరసరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్‌ అకాడమీ యజమాని ఆవుల సుబ్బారావు పేరు కనిపించ లేదు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ మేనేజర్‌ రాజ నర్సు ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ వెల్లడించింది. 

విధ్వంసంలోని ప్రతి ఘట్టమూ సెల్‌ఫోన్లలో రికార్డింగ్‌ 
సికింద్రాబాద్‌ స్టేషన్‌లో స్వయంగా విధ్వంసం సృష్టించిన వారే సాక్ష్యాధారాలను పరోక్షంగా ఇచ్చారని అధికారులు చెప్తున్నారు. ఈ విధ్వంసంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తాము చేసే చర్యలను తమ ఫోన్లలో ఇతరుల ద్వారా రికార్డు చేయించారు. రైలు ఇంజిన్‌ పగలకొట్టడం దగ్గర నుంచి బోగీలు కాల్చడం వరకు ప్రతి ఘట్టాన్నీ ఇలా చిత్రీకరించారు.

ఓ ఆందోళనకారుడు ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ బోగీలోకి ఎక్కి, అక్కడ దొరికిన కాగితాలను సీటులో వేసి, మంట అంటిస్తున్నదీ తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేయించాడు. ఇలాంటి ఫొటోలు, వీడియోలను కొన్నింటిని వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేయగా మరికొన్ని గ్యాలరీల్లో సేవ్‌ అయి ఉన్నాయి. 45 మంది నిందితులను అరెస్టు చేసిన జీఆర్పీ పోలీసులు వారి నుంచి 44 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించి ఈ విధ్వంసానికి పథక రచన చేసిన వారి వివరాలను వాట్సాప్‌ గ్రూపుల ద్వారా తెలుసుకున్నారు.

ఫోన్లలో ఉన్న వీడియో, ఫొటో సాక్ష్యాలను సేకరిం చారు. న్యాయస్థానం అనుమతితో ఈ ఫోన్ల ను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపి వీటిని పక్కా ఆధారాలుగా తయారు చేయాలని నిర్ణయిం చారు. మరోపక్క విధ్వంసం కేసును హైదరాబాద్‌ పోలీసులకు బదిలీ చేశామని రైల్వే ఎస్పీ ఆదివారం రాత్రి ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు ఇవ్వాలని, సోమవారం వరకు అలాంటివి అందలేదని నగర పోలీసులు చెప్తున్నారు. 

సుబ్బారావుని తెస్తారా? లేదా?
ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటకు చెందిన సా యి డిఫెన్స్‌ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును ఈ కేసులో అరెస్టు చేయడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. విధ్వంసానికి పాల్పడిన నిందితుల్లో 272 మంది నగరంలోని ఇతడి బ్రాంచ్‌ అభ్యర్థులని పోలీసులు గుర్తించారు.

అభ్యర్థులను రెచ్చగొట్టడంతోపాటు ఉదంతం జరగడానికి ముందు రోజు రాత్రి సికింద్రాబాద్‌ వచ్చాడని, ఘటన జరిగిన రోజు కొన్ని గంటలు ఉన్నాడని తేల్చారు. అయితే నరసరావుపేట పోలీసుల అదుపులో ఉన్న ఇతడిని తమకు అప్పగించాలంటూ రైల్వే పోలీసులు కోరలేదు. సుబ్బారావును నిందితుడిగా చేర్చడానికి మరికొన్ని ఆధారాలు అవసరమని ఓ అధికారి పేర్కొన్నారు. 

కీలక నిందితులది కామారెడ్డి జిల్లా 
సాక్షి, కామారెడ్డి: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ కేసులో కీలక నిందితులు కామారెడ్డి జిల్లాకు చెందిన వారే ఉన్నారు. కేసులో ఏ1గా ఉన్న మలపెల్లి మధుసూదన్‌ (20)ది ఎల్లారెడ్డి కాగా.. ఏ5 సంతోష్‌ (22) గాంధారి మండలం మాతుసంగెంకు చెందిన వాడు, ఏ13 బూక్య పెంట్య (19) మాచారెడ్డి మండలం ఎల్లంపేటకు చెందిన వ్యక్తిగా తేల్చారు. వీరితోపాటు విధ్వంసంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్‌ డివిజన్లకు చెందిన మరో 12 మంది ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం పోలీసులు జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.  

మరిన్ని వార్తలు