బ్యాంకులను మోసగించిన కేసులో రూ.100 కోట్ల ఆస్తుల జప్తు

24 Dec, 2021 03:20 IST|Sakshi

143 మంది బినామీల పేర్లతో రూ.112.41 కోట్ల రుణాలు తీసుకున్న రెబ్బా సత్యనారాయణ

సాక్షి, అమరావతి/దొండపర్తి (విశాఖ దక్షిణ)/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసిన కేసులో విశాఖపట్నానికి చెందిన రెబ్బా సత్యనారాయణ, అతడి కుటుంబసభ్యుల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం జప్తు (అటాచ్‌) చేసింది. చేపల చెరువుల కోసం రాజమహేంద్రవరం ఐడీబీఐ బ్యాంకు నుంచి 143 మంది బినామీల పేరుతో రూ.112.41 కోట్ల రుణం తీసుకున్న ఆయనపై ఈడీ గతంలో కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వ్యవసాయ భూములు, చేపల చెరువులు, బ్యాంకులో నగదు, ప్లాట్ల రూపంలో ఉన్న రూ.100 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తుచేసింది. సత్యనారాయణ అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఒక సంస్థకు 24 లక్షల డాలర్ల విలువైన సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసినట్లు గుర్తించామని, ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో ఆధారాలను సేకరించాల్సి ఉందని ఈడీ ప్రకటించింది. బినామీల పేర్లతో రుణాలు తీసుకుని ఆ ఖాతాల్లోకి డబ్బు రాగానే సత్యనారాయణ విత్‌డ్రా చేసుకున్నాడు.

ఈడీ అటాచ్‌ చేసిన సత్యనారాయణ ఆస్తులు  

అతడి పేరుమీదే కాకుండా కుటుంబసభ్యులు, బినామీల పేరిట ఆస్తులు కొనుగోలు చేశాడు. ఆ ఆస్తులను ఇతర బ్యాంకులకు తనఖా పెట్టి మళ్లీ రుణాలు తీసుకున్నాడు. ఎగుమతులు, దిగుమతుల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడు. బినామీల పేరు మీద రుణాలు పొంది బ్యాంకును మోసం చేసినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు గ్రహించి సత్యనారాయణపై కేసు పెట్టడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు గత కొన్నేళ్లుగా ఇదే విధంగా బ్యాంకులను మోసం చేస్తూ బినామీ వ్యాపారాల కోసం రుణాలు పొందుతూ, కొత్త రుణాలతో పాత రుణాలను సెటిల్‌ చేస్తూ వస్తున్నట్లు వెల్లడైంది. బినామీ పేర్లతో రుణాలు తీసుకున్న వ్యవహారంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు