ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల సామగ్రి స్వాధీనం

14 Oct, 2021 04:02 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న మావోయిస్టుల తుపాకీలు, ఇతర సామగ్రి

మల్కన్‌గిరి ఆస్పత్రిలోనే ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు 

పాడేరు: ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని మథిలి పోలీసుస్టేషన్‌ పరిధిలోని తుల్సి పహద్‌ అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టులకు చెందిన భారీ సామగ్రి, తుపాకీలను పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దండకారణ్యంలో ఎస్‌వోజీ, జీవీ ఎఫ్‌ పార్టీలు, ఇతర పోలీసు బలగాలు కూంబింగ్‌ నిర్వహించగా ఎదురు కాల్పుల ఘటనలో ముగ్గురు కీలక  మావోయిస్టులు మృతి చెందారు.

మృతి చెందిన వారిలో మల్కన్‌గిరి జిల్లా సుదాకొండ గ్రామానికి చెందిన అనిల్‌ అలియాస్‌ కిషోర్‌ అలియాస్‌ ముఖసొడి (ఏసీఎస్‌ క్యాడర్, రూ.5 లక్షల రివార్డు) ఆంధ్రా, ఒడిశా బోర్డర్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీలోని గుమ్మ బ్లాక్‌లో కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

అలాగే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన మహిళా మావోయిస్టు సోని ఏసీఎం క్యాడర్‌లో మావోయిస్టు కీలకనేత ఉదయ్‌కు ప్రొటెక్షన్‌ టీంలో పనిచేస్తున్నారు. ఆమెపైనా రూ.4 లక్షల రివార్డు ఉంది. ఆంధ్రాకు చెందిన విశాఖ ఏజెన్సీలోని పెదబయలు మండలానికి చెందిన చిన్నారావు మావోయిస్టు సభ్యుడిగా, మావోయిస్టు మహిళ నేత అరుణ ప్రొటెక్షన్‌ టీంలో పనిచేస్తున్నారు. ఆయనపై రూ.లక్ష రివార్డు ఉంది. ఈ ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి చెందడంతో మావోయిస్టు పార్టీకి దండకారణ్యంలో గట్టిదెబ్బ తగిలింది. 

మరిన్ని వార్తలు