ర్యాగింగ్‌ రక్కసి: కులమేంటని అడిగి.. సార్‌ అని పిలవాలని హుకుం, గదిలో బంధించి దారుణం

3 Jan, 2022 02:46 IST|Sakshi

సూర్యాపేటలో ర్యాగింగ్‌ రక్కసి

మెడికల్‌ కాలేజీలో ఫస్టియర్‌ స్టూడెంట్‌పై సీనియర్స్‌ దాడి

హాస్టల్‌ గదిలో నాలుగు గంటలు బంధించి చిత్రహింసలు

గుండు గీసేందుకు ప్రయత్నం.. కన్నీరుపెట్టుకున్నా వదలని వైనం

సూర్యాపేట క్రైం: కాలేజీల్లో ర్యాగింగ్‌ భూతం అంతమైపోయిందన్న సమయంలో మళ్లీ అలాంటి సంఘటన ఒకటి వెలుగు చూసింది. సూర్యాపేట మెడికల్‌ కళాశాలకు సంబంధించిన హాస్టల్‌లో ఓ జూనియర్‌ విద్యార్థిని రెండో సంవత్సరం విద్యార్థులు నాలుగు గంటలు గదిలో బంధించి హింసించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సెల్యూట్‌ చేయించుకోవడమే కాకుండా పిడిగుద్దులు గుద్దారు. కన్నీరుపెట్టి వేడుకున్నా వదలకుండా ట్రిమ్మర్‌తో గుండు గీసేందుకు ప్రయత్నించారు. టాయిలెట్‌ వస్తుందని అక్కడి నుంచి బయటపడ్డ ఆ విద్యార్థి ఫోన్‌ చేసి విషయం తల్లి దండ్రులకు చెప్పాడు.  

తమ రూమ్‌కు రమ్మని కబురు పంపి..
హైదరాబాద్‌లోని మైలార్‌దేవులపల్లికి చెందిన విస్కనూరి సురేష్‌ కుమారుడు సాయికుమార్‌ సూర్యాపేట మెడికల్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 15 నుంచి జనవరి 2 వరకు సెలవులు ప్రకటించడంతో ఇంటికి వెళ్లాడు. సెమిస్టర్స్‌ ఉండటంతో ప్రిపేర్‌ అయ్యేందుకు ఈ నెల 1న రాత్రి 8 గంటలకు మెడికల్‌ కళాశాలకు సంబంధించిన రెడ్డి హాస్టల్‌కు చేరుకున్నాడు. రాత్రి భోజనం చేసి హాస్టల్‌లోని రెండో ఫ్లోర్‌లోని తన రూమ్‌కు వెళ్లాడు.

రాత్రి 8.40కు సాయికుమార్‌ను ఫస్ట్‌ ఫ్లోర్‌కు రమ్మని హరీశ్‌తో పాటు మరికొందరు రెండో సంవత్సరం విద్యార్థులు.. నితీశ్‌తో కబురు పంపారు. దీంతో ఫస్ట్‌ ఫ్లోర్‌కు వచ్చిన సాయిని ఫార్మల్‌ డ్రెస్, షూ వేసుకురమ్మనగా అతను అలాగే వేసుకొని వచ్చాడు. సీనియర్స్‌ హరీశ్, రంజిత్, శ్రవణ్, శశాంక్, మహేందర్, చాణక్య, సుజిత్‌ తదితర 25–30 మంది సాయితో సెల్యూట్‌ చేయించుకున్నారు.

‘కులమేంటని అడిగారు. సార్‌ అని పిలవాలని, తల్లిదండ్రులు, అక్కాచెల్లి వివరాలు చెప్పాలని వేధించారు. ఇందంతా వీడియో తీశారు. వాయిస్‌ రికార్డింగ్‌ చేస్తావా అంటూ మోకాళ్లపై కూర్చోబెట్టి పిడి గుద్దులు గుద్దారు. ట్రిమ్మర్‌తో గుండు గీయాలని చూశారు’ అని సాయి కన్నీరుమున్నీరయ్యాడు. 

టాయిలెట్‌ వస్తుందని చెప్పి..
టాయిలెట్‌ వస్తుందని చెప్పి ఫస్ట్‌ ఫ్లోర్‌లోని బాత్‌రూమ్‌కు సాయి వెళ్లాడు. అక్కడ నుంచి తన రూమ్‌కు వెళ్లి మరో జూనియర్‌ విద్యార్థి వద్ద ఫోన్‌ తీసుకుని తల్లిదండ్రులకు ఏడుస్తూ విషయాన్ని వివరించాడు. వెంటనే తండ్రి సురేశ్‌ హైదరాబాద్‌ నుంచే 100కు కాల్‌ చేసి ఫిర్యాదు చేశారు. అరగంట తర్వాత సూర్యాపేట పట్టణ పోలీసులు రెడ్డి హాస్టల్‌కు చేరుకుని సాయిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తల్లిదండ్రులు తెలిపారు. అయితే, జరిగిన ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని, లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని సూర్యాపేట పట్టణ సీఐ ఆంజనేయులు చెప్పడం గమనార్హం. 

రాజీ కుదిర్చాం.. వెళ్లిపోండంటూ..
సాయి తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని కాలేజీ సూపరింటెండెంట్‌కు చెప్పగా.. ‘రాజీ కుదిర్చాం. పోలీసులతో మాట్లాడాం. కాలేజీ పేరు బజారున పడకుండా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. కళాశాల అన్నాక ఇలాంటివి సర్వసాధారణమే’నని చెప్పి పంపించినట్లు విద్యార్థి తండ్రి తెలిపాడు. విషయాన్ని బయటకు చెప్పొద్దని హుకూం జారీ చేశారని కన్నీరుమున్నీరయ్యారు.

గతంలో మరొకరిని ర్యాగింగ్‌ చేసినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీయగా ‘మేం చూసుకుంటాం. మీరు వెళ్లిపోండి’ అని సూపరింటెండెంట్‌ ఘాటుగా చెప్పారని వాపోయారు. దీనిపై సూపరింటెండెట్‌ మురళీధర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సీవీ శారదను వివరణ కోరేందుకు యత్నించగా ఫోన్‌ తీయలేదు.  

సూసైడ్‌ చేసుకోవాలనుకున్నా
శనివారం రాత్రి సీనియర్స్‌ నన్ను 4 గంటలు గదిలో బంధించి మద్యం, పొగ తాగుతూ పిడిగుద్దులు గుద్దారు. వీడియోలు తీసి ట్రిమ్మర్‌తో గుండు గీసేందుకు ప్రయత్నించారు. తల్లిదండ్రులు, సిస్టర్స్‌ బయోడేటా వందసార్లు చెప్పించారు. దీంతో శనివారం అర్ధరాత్రి సూసైడ్‌ చేసుకోవాలనిపించింది. నెల రోజులుగా హాస్టల్‌లో ర్యాగింగ్‌ చేస్తున్నారు. యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసి రెండ్రోజులైనా న్యాయం జరగలేదు. 
– సాయికుమార్, ప్రథమ సంవత్సరం విద్యార్థి, సూర్యాపేట మెడికల్‌ కళాశాల 

మరిన్ని వార్తలు