కీచక తండ్రికి మరణించే దాకా జైలుశిక్ష 

11 Mar, 2023 02:21 IST|Sakshi

నాంపల్లి సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు 

2021లో కూతురిపై పలుమార్లు తండ్రి అత్యాచారం 

అన్నంలో నిద్రమాత్రలు కలిపి ఘాతుకం 

ఎవరికైనా చెబితే చంపేస్తాననడంతో భయపడ్డ బాధితురాలు 

బాలిక గర్భం దాల్చడంతో బయటపడ్డ దురాగతం

బంజారాహిల్స్‌: కన్నకూతురికి భోజనంలో నిద్రమాత్రలు కలిపి తినిపించి ఆమె నిద్రపోయాక కొంతకాలంపాటు అత్యాచారానికి పాల్పడిన కీచక తండ్రికి న్యాయస్థానం మరణించే వరకు జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వలసవచ్చింది. కుటుంబ పెద్ద జూబ్లీహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు.

2003లో వివాహమైన ఈ దంపతులకు 16 ఏళ్ల కూతురు, 14 ఏళ్ల కొడుకు ఉన్నారు. సొంత జిల్లాలోని బంధువుల ఇంట్లో కొడుకు 8వ తరగతి చదువుతుండగా కూతురు తల్లిదండ్రుల వద్దే ఉంటూ 9వ తరగతి మధ్యలోనే ఆపేసి ఇంట్లోనే ఉంటోంది. 2021 జూలై 16న కూతురు తీవ్ర అనారోగ్యానికి గురై వాంతులు చేసుకోగా ఆందోళన చెందిన తల్లి నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి నాలుగు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో కూతురిని నిలదీయగా తండ్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపి తినిపించి నిద్రపోయాక అత్యాచారానికి పాల్పడేవాడని చెప్పింది.

నిద్రలోంచి లేచి చూసుకుంటే తన ఒంటిపై బట్టలుండేవి కావని, ఒళ్లంతా నొప్పులు ఉండేవని వివరించింది. ఓసారి మద్యం మత్తులో ఇంటికొచ్చి మరోసారి లైంగికదాడికి పాల్పడ్డాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించడంతో భయపడి మిన్నకుండిపోయానని రోదించింది. ఈ ఉదంతంపై బాధితు రాలి తల్లి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడు వెంకటరమణను అరెస్టుచేసి నాంపల్లిలోని 12వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో హాజరుపరిచారు. వెంకటరమణపై పక్కా ఆధారాలు సమర్పించారు. వాదనలు విన్న జడ్జి అనిత శుక్రవారం వెంకటరమణను దోషిగా తేల్చి అతనికి మరణించే వరకు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.  

మరిన్ని వార్తలు