హైవే కిల్లర్‌ మున్నా గ్యాంగ్‌కు రేపే శిక్ష ఖరారు

19 May, 2021 03:36 IST|Sakshi
మున్నా (ఫైల్‌)

పోలీసుల పేరుతో లారీల తనిఖీ

ఆపై గొంతుకు తాడు బిగించి హత్యలు

ప్రకాశం జిల్లాలో నమోదైన 4 కేసుల్లో 18 మంది నేరస్తులుగా నిర్ధారణ

ఒంగోలు: హైవే కిల్లర్‌ మున్నా.. ఈ పేరు వింటేనే ఒంగోలు ఉలిక్కిపడుతుంది. లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా చంపి గోతాల్లో కుక్కి వాగుల వద్ద పూడ్చిపెట్టిన ఘటనలు ఒళ్లు జలదరింపజేస్తాయి. 2008లో వెలుగు చూసిన 4 కేసుల్లో 18 మందిపై నేరం నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో 8వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.మనోహరరెడ్డి ఈ నెల 20న తీర్పు వెలువరించనున్నారని జిల్లా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎస్‌.శివరామకృష్ణ ప్రసాద్‌ తెలిపారు. నేరస్తులను మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు పటిష్ట బందోబస్తు నడుమ జిల్లా జైలుకు తరలించారు.

నేరాలు వెలుగులోకి వచ్చాయిలా..
పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌ నుంచి 21.7 టన్నుల ఇనుప రాడ్లతో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్‌ అదృశ్యమయ్యారంటూ 2008 అక్టోబర్‌ 17న లారీ యజమాని వీరప్పన్‌ కుప్పుస్వామి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పాత ఇనుము వ్యాపారులపై నిఘా పెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సయ్యద్‌ అబ్దుల్‌ సమద్‌ అలియాస్‌ మున్నా కోసం గాలింపు చేపట్టారు. దాదాపు 20కి పైగా సిమ్‌ కార్డులు మార్చి దేశం వదిలి పారిపోయేందుకు యత్నించిన మున్నాను కర్ణాటకలోని ఒక మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో అరెస్టు చేసి ఒంగోలుకు తీసుకువచ్చారు. 

నాలుగు ఘటనల్లో ఏడుగురి హత్య
మున్నా గ్యాంగ్‌ పోలీసు వేషాలు ధరించి హైవేపై వచ్చీపోయే వాహనాలను నిలుపుదల చేసేవారు. మున్నాకు సెక్యూరిటీగా మెషిన్‌ ధరించిన వ్యక్తి కూడా ఉండటంతో ఎవరో పెద్ద అధికారి వచ్చారనుకుని డ్రైవర్లు లారీలను ఆపేవారు. గ్యాంగ్‌ సభ్యులు చెకింగ్‌ పేరుతో లారీలోకి డ్రైవర్లు, క్లీనర్ల గొంతులకు తాడు బిగించి అతి కిరాతకంగా హతమార్చేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒంగోలు పరిధిలో మొత్తం 4 కేసుల్లో ఏడుగురిని హత్య చేసినట్టు నిరూపణ అయ్యింది. తమిళనాడు లారీ డ్రైవర్‌ రామశేఖర్, క్లీనర్‌ పెరుమాళ్‌ సుబ్రమణిలను ఉలవపాడు సమీపంలో హత్యచేసి అందులోని 21.7 టన్నుల ఇనుమును గుంటూరులోని ఒక ప్రముఖ వ్యాపారికి విక్రయించారు. డ్రైవర్, క్లీనర్‌ శవాలను గోతాలలో కుక్కి మద్దిపాడు మండలం ఇనుమనమెళ్లూరు గుండ్లకమ్మ వాగు కట్టలో పూడ్చిపెట్టారు.

మరో ఘటనలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌ ఉల్లా నుంచి కాంచీపురానికి ఇనుప లోడును తీసుకెళుతుండగా.. తెట్టువద్ద ఆపి డ్రైవర్‌ భూషణ్‌యాదవ్, క్లీనర్‌ చందన్‌ కుమార్‌ మెహతోలను చంపి శవాలను మన్నేరు వాగు వద్ద పూడ్చిపెట్టారు. ఇంకో ఘటనలో తమిళనాడులోని గుమ్మడిపూడి నుంచి కాకినాడకు ఇనుప యాంగ్యులర్‌లతో బయల్దేరిన లారీని మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు నిమ్రా కాలేజీ వద్ద ఆపి డ్రైవర్లు గూడూరి శ్యాంబాబు, గుత్తుల వినోద్‌కుమార్‌లను దారుణంగా హత్యచేసి శవాలను నాగులుప్పలపాడు మండలం చదలవాడ గుండ్లకమ్మ ఒడ్డున పూడ్చిపెట్టారు. నాగాలాండ్‌కు చెందిన లారీని కూడా ఇదేవిధంగా ఆపి డ్రైవర్‌ను హతమార్చి మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు గ్రామంలోని గుండ్లకమ్మ ఒడ్డున చిల్లచెట్లలో పూడ్చిపెట్టారు. మాయమైన లారీలు మద్దిపాడు మండలం సీతారామపురం కొష్టాలు వద్ద లీజుకు తీసుకున్న టుబాకోస్‌ వెనుక గోడౌన్‌లో ముక్కలు చేసినట్టు గుర్తించారు. ముఠా నాయకుడు మున్నాపై కడప, నల్గొండ, తెనాలి, విజయవాడ, బెంగళూరు, ప్రకాశం జిల్లాతోపాటు అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు